– విజయభేరి సన్నాహక సభలో వివాదం
– ఆధిపత్యానికి ఆయా వర్గాల ఆరాటం
– పరస్పర కామెంట్లతో అతలాకుతలం
– బయటకు వెళ్లిన భట్టి… సముదాయించిన పొంగులేటి
– తీరుమారని కాంగ్రెస్ నేతల తీరుపై అభిమానుల ఆగ్రహం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
‘ఖమ్మం అంటే కాంగ్రెస్…కాంగ్రెస్ అంటే ఖమ్మం’ అనే రీతిలో గత రెండు శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫలితాలు వచ్చాయి. అధికార బీఆర్‌ఎస్ ఈసారి ఎలాగైనా మెరుగైన ఫలితాలు సాధించాలనే పట్టుదలతో ఉంటే…దానికి ఊతమిచ్చే పరిస్థితులు కాంగ్రెస్‌లో నెలకొన్నాయి. ఖమ్మం మాజీ ఎంపీ, టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరికతో కాంగ్రెస్‌లో జోష్ పెరిగినా…ఆ పార్టీకి అంతర్గత వర్గ పోరు చేటు తెచ్చేలా ఉంది. ఏ సమావేశమైనా కుమ్ములాటలు… వర్గపోరుతో అట్టుడికే కాంగ్రెస్ నేతల తీరుపై ఆ పార్టీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 17న హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ప్రాంగణంలో నిర్వహించే విజయభేరి సభ విజయవంతం కోసం ఖమ్మం డీసీసీ కార్యాలయం (సంజీవరెడ్డి భవనం)లో సోమవారం నిర్వహించిన సన్నాహక సమావేశం రసాభాసగా మారింది. ఆధిపత్య పోరుతో అతలాకుతలం అయింది.
ఆధిపత్యం కోసం ఆరాటం..వర్గ విభేదాలతో కామెంట్లు…
ఖమ్మంలో రాహుల్‌గాంధీ హాజరైన ప్రజాగర్జన సభను సక్సెస్ చేసిన కాంగ్రెస్ శ్రేణులు సోనియాగాంధీ, కాంగ్రెస్ అధినాయకత్వం పాల్గనే విజయభేరి సన్నాహక సమావేశంలో మాత్రం వర్గ విభేదాలతో గోలగోల చేశారు. ఏఐసీసీ నుంచి ఖమ్మం పార్లమెంట్ పరిశీలకులుగా వచ్చిన మహ్మద్ నజీమ్‌ఖాన్ సమక్షంలోనే మాటల యుద్ధానికి దిగారు. సమావేశం ప్రారంభం కాగానే ‘రాయలదే పాలేరు’ అని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోరులో ఓడిన రాయల నాగేశ్వరరావు అభిమానులు నినాదాలు చేశారు. వారిని వారించే లోపే.. భట్టి సీఎం అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వర్గీయులు స్లోగన్‌లు ఇచ్చారు. ఇంతలో రేణుకాచౌదరి వర్గీయులు నినాదాలు అందుకున్నారు. రేణుకాచౌదరి జిందాబాద్… రేణుకా సీఎం అంటూ నినదించారు. మరోవైపు నుంచి పోట్ల నాగేశ్వరరావు వర్గీయులు బీసీలకు అన్యాయం…జనరల్ సీట్లలో ఒకటైనా ఇవ్వాలని నినాదాలు చేశారు. పోట్ల బీసీ కానప్పటికీ ఆయన వర్గీయులు ఈ రకమైన నినాదాలు చేయడం చర్చనీయాంశమైంది. సంప్రదాయంగా బీసీలకు ఇస్తున్న కొత్తగూడెం స్థానం నుంచి పొంగులేటి బరిలో నిలుస్తారనే ప్రచారం సాగుతోంది. పొంగులేటి పోటీ చేస్తే పోట్లకు టిక్కెట్ రాదు కాబట్టి వ్యూహాత్మకంగా మాజీ ఎమ్మెల్సీ వర్గీయులు ఈ రకంగా వ్యవహరించినట్లు చర్చ సాగింది.
భట్టి బయటకు…పొంగులేటి సముదాయింపు…
కార్యకర్తలను సముదాయించి సమావేశం సజావుగా సాగేలా చూడాల్సిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క జూమ్ మీటింగ్ పేరుతో అర్థంతరంగా బయటకు వెళ్లిపోయారు. వెంటనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మైక్ తీసుకుని ” టిక్కెట్ల విషయంలో ఏఐసీసీదే తుది నిర్ణయం…ఎవరికి టిక్కెట్లు ఇచ్చినా గెలిపించుకోవాలి. ఇదీ సోనియాగాంధీ రాక సందర్భంగా ఏర్పాటు చేసిన విజయభేరి సభ సన్నాహక సమావేశం.. ఇటువంటి సమావేశంలో మనం ఇలా గోల చేయడం కరెక్టు కాదు’ అని సముదాయించారు.
ఈసారి రేణుకా వర్గీయుల వంతు…
ఆ తర్వాత ఏఐసీసీ పరిశీలకునితో పాటు కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్… ఇలా ఒకరి తర్వాత మరొకరు మాట్లాడారు. ఈ క్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు వి.హనుమంతరావు మాట్లాడు తుండగా…రేణుకా వర్గీయులు అడ్డుకున్నారు. జిల్లాపై ఈయన పెత్తనం ఏంటి? అంటూ కేకలు వేశారు. అంతలోనే మరికొందరు ‘అమ్ముడు బోయేమంటూ…’ రేణుకాచౌదరిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. మరోవైపు నుంచి ‘వెనుక వచ్చిన వాళ్లకు ప్రాధాన్యత ఏంటి?’ అంటూ పొంగులేటిని ఉద్దేశించి మరికొందరు మాట్లాడకొచ్చారు. ‘కలిసికట్టుగా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని..విజయభేరి సభను విజయవంతం చేయాలని’ చెప్పాల్సిన విషయాన్ని చెప్పి పొంగులేటి కూడా సమావేశం నుంచి నిష్క్రమించారు. మొత్తమ్మీద జిల్లా కాంగ్రెస్‌లో నెలకొన్న ఈ వివాదం అధికారపార్టీలో ఫుల్‌జోష్‌ను నింపింది. పార్టీ అభిమానులు మాత్రం నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. అందరూ వెళ్లాక కొంత సేపటికి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వచ్చి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అంతకుముందు జరిగిన గలాట గురించి మాటమాత్రమైనా ప్రస్తావించకుండా విజయభేరి సభపై ప్రసంగించి విలేకరుల సమావేశాన్ని ముగించారు. విలేకరుల అడిగిన ప్రశ్నలకు కూడా దాటవేత సమాధానాలు చెప్పుకొచ్చారు.