నవతెలంగాణ – హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో పసిడికి భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.83 వేలు దాటింది. ఈ మార్కు దాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి రూ.200 పెరిగి రూ.83,100కి చేరుకున్నట్లు ఆలిండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం కూడా రూ.200 పెరిగి రూ.82,700కి చేరినట్లు అసోసియేషన్ పేర్కొంది. అటు వెండి సైతం కిలోకు రూ.500 మేర పెరిగింది. క్రితం ట్రేడింగ్‌లో రూ.93,500గా ఉన్న వెండి కిలో తాజాగా రూ.94 వేల మార్కుకు చేరుకుంది. అంతర్జాతీయ విపణిలో బంగారం ఔన్సు 2780 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. వెండి 31.32 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.