బంగారం చోరీ నిందితుని అరెస్ట్‌

బంగారం చోరీ నిందితుని అరెస్ట్‌– 2.955 కిలోల ఆభరణాలు రికవరీ
– వాహన తనీఖీల్లో పట్టుబడిన నిందితుడు
– పరారీలో ముగ్గురు
– గత నెల ఓ దాబా వద్ద ట్రావెల్స్‌ బస్సులో ఆభరణాల బ్యాగు చోరీ : వివరాలు వెళ్లడించిన ఎస్పీ రూపేష్‌
నవతెలంగాణ-జహీరాబాద్‌
ఓ దాబా వద్ద ఆగిఉన్న ట్రావెల్స్‌ బస్సులో నుంచి 2.955 కిలోల బంగారం ఆభరణాలను ఎత్తుకెళ్లిన దుండగులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలతోపాటు కారును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జహీరాబాద్‌ సబ్‌-డివిజన్‌ కార్యాలయంలో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్‌ సోమవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..గత నెల 26వ తేదీన సంగారెడ్డి జిల్లా చిరాగ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కోహినూర్‌ దాబా వద్ద భోజనం కోసం ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు ఆగింది. ఆ సమయంలో బస్సులో నుంచి 2.955 కిలోల బంగారం ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జహీరాబాద్‌ డీఎస్పీ రామ్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దుండగుల కోసం విస్తృతంగా గాలించారు. ఆదివారం రాత్రి జహీరాబాద్‌ డీఎస్పీ రామ్‌మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో సీఐ బి.శివలింగం, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లేశం, సీసీఎస్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌, చిరాగ్‌పల్లి ఎస్‌ఐ కె.రాజేందర్‌ రెడ్డి, జహీరాబాద్‌ రూరల్‌ ఎస్‌ఐ ప్రసాద్‌రావు, హద్నూర్‌ ఎస్‌ఐ రామానాయుడు, పలువురు సిబ్బందితో కలిసి జాతీయ రహదారి 65 రోడ్డు బూర్ధిపాడ్‌ చౌరస్తా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో మారుతి బ్రీజా కారు అతివేగంగా రావడంతో ఆపి తనిఖీ చేశారు. కారులో ఉన్న నలుగురు వ్యక్తులు కిందికి దిగి పారిపోయే ప్రయత్నం చేశారు. దాంతో అందులో నుంచి ఒక వ్యక్తిని పోలీసులు పట్టుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని కీర్వజాగీర్‌ గ్రామానికి చెందిన మాసూమ్‌ ముస్తాక్‌ఖాన్‌గా గుర్తించారు. అతను, పారిపోయిన ముగ్గురు అష్రాఫ్‌, ఫెరోజ్‌, సాజిద్‌ కలిసి దాబాల వద్ద ఆగి ఉన్న ట్రావెల్స్‌ బస్సుల్లో దొంగతనాలు చేస్తున్నట్టు నిందితుడు చెప్పాడు. గత నెలలో కోహినూర్‌ దాబా వద్ద కూడా బస్సులో నుంచి బంగారం ఆభరణాలు ఎత్తుకెళ్లినట్టు చెప్పడంతో పాటు.. కారులోని ఓ బ్యాగులో ఉన్న 2.955 కిలోల ఆభరణాలను పోలీసులకు చూయించాడు. ఆదివారం జహీరాబాద్‌ ప్రాంతంలో ఓ పెద్ద దొంగతనం చేసి.. మొత్తం బంగారాన్ని హైదరాబాద్‌లో విక్రయించడానికి ప్లాన్‌ వేసినట్టు చెప్పాడు. ఈ క్రమంలో పోలీసులకు పట్టు బడ్డారు. కాగా, నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, బంగారం ఆభరణాలు, బ్రీజా కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాఫ్తులో కీలకంగా పనిచేసిన ప్రతి ఒక్కరినీ ఎస్పీ అభినందించి.. రివార్డ్‌ అందజేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఎ.సంజీవరావ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love