బంగారు అథ్లెట్స్‌

Golden athletes– పారుల్‌ చౌదరి, అన్ను రాణికి స్వర్ణం
– అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌, ఆర్చరీలో మెడల్స్‌
– 2023 హాంగ్జౌ ఆసియా క్రీడలు
హాంగ్జౌ ఆసియా క్రీడల్లో మన అథ్లెట్లు అదరగొడుతున్నారు. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో టీమ్‌ ఇండియాకు పతక వరద కొనసాగుతుంది. పారుల్‌ చౌదరి, అన్ను రాణి బంగారు పతకాలు కైవసం చేసుకోగా..తేజస్విని శంకర్‌, మహ్మద్‌ అఫ్సాల్‌లు రజత పతకాలు సొంతం చేసుకున్నారు. పి. చిత్రవేల్‌, విత్య రామ్‌రాజ్‌లు కాంస్య పతకాలతో మెరవటంతో మంగళవారం హాంగ్జౌ అథ్లెటిక్స్‌లో భారత్‌ ఏకంగా ఆరు పతకాలు సొంతం చేసుకుంది. ఇతర ఈవెంట్లలో కలిపి తొమ్మిది పతకాలు భారత్‌ ఖాతాలో వేసుకుంది. 69 మెడల్స్‌తో పతకాల పట్టికలో భారత్‌ నాల్గో స్థానంలో కొనసాగుతుంది.
నవతెలంగాణ-హాంగ్జౌ
అథ్లెటిక్స్‌లో టీమ్‌ ఇండియాకు ఎదురు లేదు. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్లలో మంగళవారం భారత్‌ మరో ఆరు పతకాలు కైవసం చేసుకుంది. రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్య పతకాలతో హాంగ్జౌను హౌరెత్తించింది. మహిళల 5000 మీటర్ల రేసులో పారుల్‌ చౌదరి పసిడి పరుగు తీసింది. పతక రేసును 15 నిమిషాల 14.75 సెకండ్లలో పూర్తి చేసిన పారుల్‌ చౌదరి.. స్వర్ణం సొంతం చేసుకుంది. జపాన్‌ స్ప్రింటర్‌ హిరోనాక 15.15.34 సెకండ్లతో సిల్వర్‌ సాధించగా, కజకిస్థాన్‌ అథ్లెట్‌ 15.23.12 సెకండ్లతో కాంస్య పతకం అందుకుంది. ఈ విభాగంలో పోటీపడిన మరో భారత అథ్లెట్‌ అంకిత 15.33.08 సెకండ్లతో ఐదో స్థానంలో సరిపెట్టుకుంది. జావెలిన్‌ త్రోలో సూపర్‌స్టార్‌ నీరజ్‌ చోప్రా కంటే ముందే మరో అథ్లెట్‌ బంగారు పతకం అందించింది. మహిళల జావెలిన్‌ త్రోలో అన్ను రాణి స్వర్ణం సాధించింది. ఫైనల్లో ఈటను 62.92 మీటర్ల దూరం విసిరిన అన్ను రాణి ఈ సీజన్లోనే అత్యుత్తమ ప్రదర్శన చేసింది. 61.57 మీటర్ల త్రోతో శ్రీలంక అథ్లెట్‌ లెకాగె సిల్వర్‌ సాధించగా, చైనా అథ్లెట్‌ 61.29 మీటర్ల త్రోతో కాంస్య దక్కించుకుంది. పురుషుల డెకథ్లాన్‌లో తేజస్విని శ్రీశంకర్‌ చరిత్ర సృష్టించాడు. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఈ విభాగంలో 1974 తర్వాత తొలి మెడల్‌ అందించాడు. మంగళవారం జరిగిన 1500 మీటర్ల రేసును 4 నిమిషాల 48.32 సెకండ్లతో ముగించిన తేజస్విని శ్రీశంకర్‌ నాల్గో స్థానంలో నిలిచాడు. డెకథ్లాన్‌ ఈవెంట్‌లో 100మీ, లాంగ్‌ జంప్‌, షాట్‌పుట్‌, హై జంప్‌, 400 మీ, 110మీ హార్డిల్స్‌, డిస్కస్‌ త్రో, పోల్‌ వాల్ట్‌, జావెలిన్‌ సహా 1500మీ రేసు పోటీల ఉంటాయి. ఈ అన్ని పోటీల అనంతరం ఓవరాల్‌గా అత్యుత్తమ ప్రదర్శన చేసిన టాప్‌-3 అథ్లెట్లు పతక విజేతలుగా నిలుస్తారు. తేజస్విని శ్రీశంకర్‌ సూపర్‌ ప్రదర్శనతో భారత్‌కు సిల్వర్‌ మెడల్‌ అందించాడు. పురుషుల 800 మీటర్ల రేసులో సైతం భారత్‌కు రజత పతకం దక్కింది. పి. మహ్మద్‌ అఫ్సల్‌ రేసును 1 నిమిషం 48.43 సెకండ్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. సౌదీ అరేబియా అథ్లెట్‌ 1.48.05 టైమింగ్‌తో స్వర్ణం, ఓమన్‌ అథ్లెట్‌ 1.48.51 టైమింగ్‌తో కాంస్యం అందుకున్నారు. పురుషుల ట్రిపుల్‌ జంప్‌లో చిత్రవేల్‌ పి కాంస్య పతకంతో రాణించాడు. 16.68 మీటర్ల జంప్‌తో మెరిసిన చిత్రవేల్‌ పతక వేటలో మూడో స్థానంలో నిలిచాడు. చైనా అథ్లెట్లు స్వర్ణం, సిల్వర్‌ కైవసం చేసుకున్నారు. మహిళల 400 మీటర్ల హార్డిల్స్‌లో విత్య రామ్‌రాజ్‌ బ్రాంజ్‌ మెడల్‌ సాధించింది. రేసును 55.68 సెకండ్లలో ముగించిన విత్య మూడో స్థానంలో నిలిచి కాంస్య అందుకుంది. బహ్రెయిన్‌, చైనా అథ్లెట్లు వరుసగా గోల్డ్‌, సిల్వర్‌ మెడల్స్‌ సాధించారు.
కానోరు స్ప్రింట్‌లో భారత్‌కు కాంస్య పతకం లభించింది. 3 నిమిషాల 53.329 సెకండ్ల టైమింగ్‌తో భారత్‌ మూడో స్థానంలో నిలువగా.. ఉబ్బెకిస్థాన్‌ 3.43.796, కజకిస్థాన్‌ 3.49.991తో టాప్‌-2లో నిలిచాయి. భారత్‌ నుంచి సునీల్‌ సింగ్‌, అర్జున్‌ సింగ్‌ జోడీ ఈ స్ప్రింట్‌లో పతక ప్రదర్శన చేసింది. ఇక మహిళల 50 కేజీల విభాగంలో తెలంగాణ సూపర్‌స్టార్‌ నిఖత్‌ జరీన్‌ కాంస్య పతకం సాధించింది. ఈ విభాగంలో ఈ రోజు పసిడి ఫైట్‌ జరగటంతో నిఖత్‌ జరీన్‌కు అధికారికంగా బ్రాంజ్‌ మెడల్‌ ప్రదానం చేశారు. పసిడి ఫేవరేట్‌గా బరిలో నిలిచిన ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ అనూహ్యంగా సెమీస్‌లో ఓటమిపాలై కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఒలింపిక్‌ మెడలిస్ల్‌ లవ్లీనా బొర్గొహైన్‌ పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌తో పాటు కనీసం రజతం ఖాయం చేసుకుంది. మహిళల 75 కేజీల విభాగం సెమీస్‌లో బొర్గొహైన్‌ 5-0తో థారులాండ్‌ బాక్సర్‌ను చిత్తు చేసి పసిడి ఫైట్‌కు చేరుకుంది. మహిళల 54 కేజీల సెమీస్‌లో ప్రీతి 0-5తో నిరాశపరిచి, కాంస్యానికి పరిమితమైంది. మెన్స్‌ 92 ప్లస్‌ కేజీల విభాగం సెమీస్‌లో నరేందర్‌ 0-5తో నిరాశపరిచాడు. చైనా బాక్సర్‌కు ఫైనల్‌ బెర్త్‌ కోల్పోయి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. ఇక స్క్వాష్‌లో భారత్‌కు సౌరభ్‌ ఘోషల్‌.. అనహత్‌, అభరు.. దీపిక పల్లికల్‌, హరిందర్‌ పాల్‌ సింగ్‌లు పతకాలు ఖాయం చేశారు. ఆర్చరీలో జ్యోతి సురేఖ, అభిషేక్‌ వర్మలు పతకాలు ఖాయం చేయగా.. మరో విభాగంలో టీమ్‌ ఇండియాకు ఏకంగా గోల్డ్‌, సిల్వర్‌ మెడల్‌ ఖాయమయ్యాయి. ఈ విభాగాల్లో పసిడి పోటీలు అక్టోబర్‌ 7న జరుగుతాయి.

Spread the love