– రెండో విడత గొర్రెల పంపిణీకి డిమాండ్
– నగదు రూపంలో ఇవ్వాలని నినాదాలు
నవతెలంగాణ- విలేకరులు
రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని, లబ్దిదారులకు నగదు రూపంలో ఇవ్వాలని గొల్ల కురుమలు డిమాండ్ చేశారు. సోమవారం జీఎంపీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేశారు.
ఖమ్మం కలెక్టరేట్ ఎదుట జీఎంపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్‌కి వినతిపత్రం అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఐదు మండలాల గొల్ల కురుమలు ధర్నా నిర్వహించారు. అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి బచ్చలకూర శ్రీనివాస్ మాట్లాడుతూ.. గొల్ల కురుమలకు పూర్తి సబ్సిడీతో నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించి నగదు బదిలీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనగామ కలెక్టరేట్‌ను గొల్ల కురుమలు ముట్టడించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు పెద్దఎత్తున ర్యాలీ చేపట్టారు. అక్కడ ఒక్కసారిగా కలెక్టరేట్లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే బందోబస్తులో ఉన్న పోలీసులు కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద ఇనుప ముండ్ల కంచె వేశారు. మహ బూబాబాద్ జిల్లా కేంద్రంలో కురవి రోడ్‌లోని ధర్నా చౌక్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు.