వారం లోగా తునికాకు బొనస్ బకాయిలను చెల్లించాలి: గొంది రాజేష్

– తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు
నవతెలంగాణ -గోవిందరావుపేట
వారంలోగా తెలిపాకు కూలీలకు చెల్లించాల్సిన బోనస్ బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గొంది రాజేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని పసర గ్రామంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా గొంది రాజేష్ హాజరై మాట్లాడారు. ములుగు జిల్లాలో తునికాకు సేకరణ దారులకు బోనస్ బకాయిలను ను వారం లోగా పంపిణీ చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గొంది రాజేష్ అన్నారు.  2016 నుండి రావాల్సిన తునికాకు బోనస్ బకాయిలను 2023 ఫిబ్రవరి నెలాఖరులోగా  చెల్లిస్తామని రాష్ట్ర ప్రధాన అటవీ అధికారి  సీసీఎఫ్  హామీ ఇచ్చారని దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి  200 కోట్ల రూపాయలు విడుదల చేసారని అన్నారు. కానీ ములుగు జిల్లాలో ఇప్పటి వరకు తునికాకు సేకరణ దారుల అకౌంట్ లలో ఒక్క రూపాయి కూడా పడలేదని తెలిపారు. నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, అసిఫాబాద్ జిల్లాలలో బోనస్ చెల్లింపులు జరుగగా ములుగు జిల్లాలో ఎందుకు ఆలస్యం  అవుతుందని ఆయన ప్రశ్నించారు. కోట్ల రూపాయలు ఫారెస్ట్ అధికారుల వ్యక్తిగత అకౌంట్ లలో ఉన్నా వాటిని లబ్ధిదారులకు అందేలా చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన అన్నారు. కుటుంబ సమేతంగా అందరూ వారి వారి శక్తి సామర్త్యాల మేరకు ఆకులను సేకరించి కట్టలు కట్టి కల్లాలలో అమ్మగా వచ్చిన డబ్బులతో విద్యా సంవత్సర ప్రారంభంలో వారి పిల్లలకు కొత్త బట్టలు కుట్టించి, నోట్- బుక్స్ పెన్నులు కొనిచ్చి వారి పిల్లలను బడులకి  పంపేవారని అన్నారు. నిజానికి వారి జీవితాలలో తునికాకు సేకరణ  ఎంతో ముఖ్యమయినదని దీన్ని బట్టి అర్ధమవుతుందని అలాంటి వారికి బోనస్ డబ్బులను  ఆలస్యం చేయడం వలన వారి జీవితాలలో కొన్ని ముఖ్యమైన అవసరాలు తీరడం ఆలస్యం అవుతుంది. దాని ప్రభావం ఇతర వాటిపై పడి ఆర్ధికంగా కృంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బోనస్ డబ్బులు ఫారెస్ట్ అధికారుల వ్యక్తిగత అకౌంట్ లలో నెలలుగా ఉన్నా లక్షలలో వడ్డీ వస్తుందని ఆయన అన్నారు. బొనస్ చెల్లించడంలో ఇప్పటికే ఆలస్యం అయ్యిందని ఈ వారం రోజుల్లో అందరి కాతాలలో బోనస్ డబ్బులు పడకుంటే  తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఫారెస్ట్ కార్యాలయాలను ముట్టడించి ఆందోళనలో నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం సభ్యులు ఓకే సారయ్య, కొట్టం కృష్ణారావు, బండ సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
Spread the love