తిండికి మెండు పనికి లండు

Good for food Ready for workకొందరు పుట్టిందే తినేందుకు అనుకుంటరు. ఫంక్షన్లల్ల అసొంటోల్లు కన్పిస్తరు. మీద పడ్డట్టే ఉంటరు కూర కాడ సగం తిని పారేస్తరు. నమలకుండానే మయ్య మయ్య నోట్లె బుక్కల పెడుతరు. ఇసొంటోల్లు ఎక్కడైనా ఇంతే. పని అంటే మనుసుకెక్కది, తిండికి సై అంటరు. వీల్లను ‘తిండికి మెండు పనికి లండు’ అంటరు. ఏదన్న పని చెయ్యమంటే అన్ని వంకలు పెట్టుతరు. మరి కొందరైతే తింటే పనులు చేస్తడని అన్నం పెట్టినం అనుకో తింటరు, పంటరు. ఇటోంటి వాన్ని ‘తింటే కదలలేడు తినకపోతే మెదులలేడు’ అంటరు. వాల్లకు కడుపు మీదనే గురి వుంటది. వాల్లింటికి ఎవలన్న సుట్టాలు వస్తే సక్కగ అర్సుకోరు వీల్ల మంత్రం అంటే ‘మా ఇంటికి వస్తే ఏం తెస్తవు మీ ఇంటికి వస్తే ఏం ఇస్తవు’ అనే రకం. పురగ దొబ్బుక పోయే వాల్లను పుల్లెగంటోడు అంటరు. ఇట్లనే ఆడవాల్లు వుంటే వాల్లను ‘పుల్లెగంటు ఆమెకు పిల్లలు దక్కరు’ అని అంటరు. అంటే తాను తినేటందుకే సరిపోతది. ఇగ పిల్లలకేమి పెడ్తదనే అర్ధంలో వాడుతరు. ఇట్లాంటి మందింట్ల తినేటోల్లను అందరు తిడుతరు. వాల్లకు వాల్లు ఏమనుకుంటరంటే ‘తిడితే గాలికి పోతయి తింటే లోపలికి పోతయి’ అని లోపల లోపల సంబుర పడుతరు. తిట్లు గాలికే పాయె బువ్వ, కూరా అయితే దొరికింది కదా అనుకునే వాల్లు వుంటరు. ఇగ వీల్లు మరి పెట్టినోల్లకు ఏమన్న గౌరవం ఇస్తరా అంటే అసలే ఇయ్యరు. పైగా ‘తిన్నింటి వాసాలు లెక్క పెడుతరు’. అంటే తినుకుంట మీదికి చూస్తే ఇంటి దూలాలు వాసాలు ఎన్ని వున్నయి, వాటిని సుత ఎవలు లేనప్పుడు ఎట్లా దొబ్బుక పోవచ్చుననే ఆరాటంతో వుంటరు. అందుకే ఆ వాసాలు లెక్కపెడుతరు. ఇసొంటోల్లను ఏమన్న అంటే కూడా మీదికే ఎగురుతరు. ఈ సందర్భంలో ‘తిండికి ఏమి లేకున్న తిక్కకేమి తక్కువ లేదు’ అంటరు. జానపదులు మనస్తత్వాలను అనుసరించే సామెతలు రూపొందించుకున్నారు.
– అన్నవరం దేవేందర్‌, 9440763479

Spread the love