కులవృత్తి దారులకు శుభవార్త

నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్రంలో కులవృత్తితో జీవనోపాధి పొందుతున్న ఎంబీసీ, బీసీలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సుమారు లక్షన్నర మందికి ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. ఒక్కో నియోజకవర్గంలో 1200 నుంచి 1500 మందికి లబ్ధి చేకూరేలా విధివిధానాలపై కసరత్తు చేస్తోంది. ఎలాంటి హామీ లేకుండా పూర్తి సబ్సిడీతో రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర దశాబ్ది వేడుకల సందర్భంగా మొదటి దశ పథకాన్ని ప్రకటించనుండగా ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక, ఆర్థిక సాయం తదితర విధివిధానాలను మంత్రివర్గ ఉపసంఘం ఖరారు చేస్తుందని ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు సీఎం సమక్షంలో సమావేశం కానున్న అధికారులు తుది విధానాలను ప్రకటిస్తారు. ఎంబీసీ, బీసీ కులాల్లోని నాయీబ్రాహ్మణులు, కుమ్మరి, మేదరి, విశ్వబ్రాహ్మణులు, రజక, పూసల కులాలతోపాటు మరిన్ని కులాలను గుర్తించిన ఉపసంఘం సీఎం అధ్యక్షతన జరిగే సమావేశంలో వివరాలను వెల్లడించనుంది. అర్హులైన కులవృత్తుల కుటుంబాల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి దశాబ్ది వేడుకల్లో భాగంగా పంపిణీ చేయనున్నారు.

Spread the love