గుడ్ న్యూస్… ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకూ ఐఆర్‌

నవతెలంగాణ హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకూ వేతన సవరణ కమిషన్‌లోని మధ్యంతర భృతి(ఐఆర్‌) ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం కార్యాలయం ఆర్థికశాఖను ఆదేశించింది. కొత్త వేతన సవరణ కమిషన్‌ ఏర్పాటు సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు 5% ఐఆర్‌ ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబరులో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆది నుంచి పీఆర్‌సీ పరిధిలో ప్రభుత్వ రంగ సంస్థలైన కార్పొరేషన్లు, వివిధ సొసైటీల ఉద్యోగులకు సైతం ఐఆర్‌ వర్తింపజేస్తున్నారు. కానీ అక్టోబరు నాటి ఉత్తర్వుల్లో వీరిని చేర్చలేదు. ఆ తర్వాత ఎన్నికల కోడ్‌ రావడం.. కొత్త ప్రభుత్వం ఏర్పడటం జరిగాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల ఐకాస ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి తమకు పీఆర్‌సీ వర్తింపజేయాలని, ఐఆర్‌ ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చింది. దీనిపై సీఎం స్పందించి వెంటనే ఆర్థికశాఖకు నోట్‌ పంపించాలని తన కార్యాలయ కార్యదర్శిని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల ప్రత్యేక కార్యదర్శి సైతం దీనిపై ఆర్థికశాఖకు లేఖ పంపించారు. అధికారులు దీనిపై ప్రతిపాదనలు రూపొందించి పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Spread the love