వాహనదారులకు గుడ్ న్యూస్..!

Good news for motorists..!నవతెలంగాణ – హైదరాబాద్ : గత కొన్ని వారాలుగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గవచ్చని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ‘ఇక్రా’ అభిప్రాయపడింది. ప్రభుత్వరంగ సంస్థలు ఇంధనంపై రూ.2 నుంచి రూ.3 వరకు తగ్గించే అవకాశముందని వెల్లడించింది. భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు బ్యారెల్ ధర సెప్టెంబర్‌లో సగటున 74 డాలర్లుగా ఉంది. మార్చిలో బ్యారెల్ చమురు ధర 83 నుంచి 84 డాలర్లుగా ఉంది. ఆ సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలను రూ.2 తగ్గించారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి అయ్యే ముడి చమురు ధరలు తగ్గడంతో గత కొన్ని వారాలుగా భారత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రిటైల్ అమ్మకాలపై మార్జిన్లు పెరిగినట్లు ‘ఇక్రా’ తెలిపింది. క్రూడాయిల్ ధరలు ప్రస్తుత ధర వద్దనే స్థిరంగా కొనసాగుతున్నట్లయితే ఇంధన ధరలను తగ్గించే అవకాశాలు ఉంటాయని అంచనా వేసింది. అంతర్జాతీయ ధరలతో పోలిస్తే చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై రూ.15, డీజిల్‌పై రూ.12 చొప్పున ఆర్జిస్తున్నాయని ‘ఇక్రా’ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గిరీశ్ కుమార్ పేర్కొన్నారు. మార్చిలో ధరలు తగ్గించిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులేదు.

Spread the love