రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్…

good-news-for-retired-rtc-employeesనవతెలంగాణ – హైదరాబాద్
పదవీ విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగులకు టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. స్వచ్ఛందంగా పదవీ విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగులకు కూడా.. రిటైర్డ్ ఎంప్లాయిస్ మెడిక‌ల్ ఫెసిలిటీ స్కీం (ఆర్ఈఎంఎఫ్ఎస్) కింద ల‌భించే ప్రయోజ‌నాల‌ను సంస్థ వర్తింపజేసింది. గ‌తంలో ఉన్న నిబంధ‌న‌ల్లో పలు మార్పులు చేస్తూ కొత్త స‌ర్కుల‌ర్‌ను సంస్థ జారీ చేసింది. ఈ మేర‌కు మార్పులు చేసిన స‌ర్క్యూల‌ర్‌ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాక‌ర్ విడుద‌ల చేశారు. మెడిక‌ల్ కారణాలతో రిటైర్డ్ అయిన సిబ్బందితో పాటు కారుణ్య ఉపాధి పొంద‌ని బాధిత జీవిత భాగ‌స్వాములూ ఈ స్కీం స‌భ్యత్వాన్ని పొంది ప్రయోజ‌నాల‌ను పొందనున్నారు. సీలింగ్ ప్రకారం స‌భ్యత్వం పొందిన ల‌బ్దిదారులు జీవిత కాలం వ‌ర‌కు వైద్య ఖ‌ర్చుల‌కు రూ.4 ల‌క్షల వ‌ర‌కు వినియోగించుకునే స‌దుపాయాన్ని టీజీఎస్ ఆర్టీసీ సంస్థ కల్పించింది.
హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో శనివారం ఉదయం నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు ఫిజియోథెరఫీ యూనిట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, ఫార్మసీని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. చికిత్స కోసం వచ్చిన ఆర్టీసీ సిబ్బందితో ఆయన మాట్లాడారు. తార్నక ఆర్టీసీ ఆస్పత్రిలో వైద్యులతో మంత్రి సమావేశమయ్యారు. సిబ్బందికి అందిస్తోన్న వైద్య సేవల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ సిబ్బందికి వైద్య సేవల విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని, తమ కుటుంబ సభ్యుల్లాగా భావిస్తూ వైద్య సేవలను అందించాలని డాక్టర్లకు సూచించారు. తార్నక ఆస్పత్రి ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు ఫిజియోథెరఫీ యూనిట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, ఫార్మసీని సదుపాయాలను సిబ్బంది వినియోగించుకోవాలన్నారు.

Spread the love