లండన్ : దొంగల్లో చాలామంది వింతగా ప్రవర్తిస్తుంటారు. ఘరానా దొంగలు, వింత దొంగలు, భలే దొంగలు, గజ దొంగలు అంటూ … రకరకాల టైటిల్స్‌తో అనేక వార్తలు వస్తుంటాయి. యూకేలోని మాన్ మౌత్ షైర్ లో ఓ మంచి దొంగ ఘటన వెలుగుచూసింది. డేమియన్ వాజినిలోవిక్జ్ లోని ఓ దొంగ గతంలో కూడా పలు నేరాలు చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. ఇటీవల మాన్ మౌత్ షైర్ లో ఓ ఇంట్లో చోరీ కోసం వెళ్లాడు. ఆ సమయంలో ఇంటి యజమానురాలు లేదు. ఇంట్లో ఒంటరి మహిళ నివాసముంటుందని తెలిసిన ఆ దొంగ … దొంగతనానికి బదులు ఇంటి పనులన్నీ చేశాడు..! అవునండీ … అన్ని పనులూ చేశాడు. ఇల్లంతా నీట్ గా సర్దేశాడు. బట్టలు ఉతకడంతోపాటు ఇంటి పనంతా చేశాడు. కిచెన్, ఫ్రిజ్ అన్నీ సర్దేశాడు. ఆపై ఫ్లోర్ తుడిచి నీట్ గా చేశాడు. ఆఫీసు నుంచి అలసిపోయి వస్తుందనే ఆలోచనతో ఇంటి యజమాని కోసం వంట చేసి భోజనం కూడా సిద్ధం చేసి పెట్టాడు. అయితే వెళుతూ వెళుతూ ‘డోంట్ వర్రీ.. బీ హ్యాపీ’ అంటూ ఓ పేపర్ పై రాసిపెట్టి వెళ్లాడు. ఇంట్లో ఉన్న రెడ్ వైన్ ను తాగి, ఆ సీసా, గ్లాసును మాత్రం టేబుల్ పై అలాగే వదిలేశాడు. ఇంట్లోకి అడుగుపెట్టిన యజమానురాలు ఇదంతా చూసి తీవ్ర భయాందోళనకు గురైంది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చింది. ఇక ఒంటరిగా ఆ ఇంట్లో ఉండలేక తన స్నేహితురాలి దగ్గర ఉండిపోయింది. తాను ఒంటరిగా ఉంటున్న విషయం తెలుసుకున్న ఆ దొంగ ఏ క్షణంలో వచ్చి ఏం చేస్తాడోననే భయపడ్డానని చెప్పింది. రెండు వారాల తర్వాత దొంగ దొరికాడని పోలీసులు ఫోన్ చేయడంతో టెన్షన్ తగ్గిందని వివరించింది.