రంగాపురంలోని రామయ్య అనే రైతు చాలా దయాస్వభావుడు. అతనికి పశుపక్ష్యాదులంటే ఎంతో ప్రేమ. వాటిని ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాడు.
ఇలా ఉండగా ఒకసారి అతడు ఒక కర్రను చేతబూని తన పొలం వైపుకు వెళుతున్నాడు. అతడు ఆ దారిలో వెళ్ళేటప్పుడు అతన్ని కరవడానికి ఒక పాము వచ్చింది. ఆ రైతు దానిని మొదట గమనించలేదు. వెంటనే ఆ చెట్టుపై ఉన్న చిలుక ”ఓ సర్పమా! నీవు పది మందికి మేలు చేసే ఈ రైతును కాటు వేస్తావా! అతడు పంటలను పండిస్తే ఆ ధాన్యాన్ని ఎలుకలు తింటున్నాయి. ఆ ఆహారాన్ని తిని అవి చాలా బలంగా తయారవుతున్నాయి. ఆ బలమైన ఎలుకలను తిని నీవు కడుపు నింపుకుంటున్నావు. పరోక్షంగా నీ ఆహారానికి కారణభూతుడైన ఆ రైతును కాటు వేయడం నీకు తగునా! నీవే చెప్పు! అతడు పరోపకారి. అటువంటి వ్యక్తిని కాటువేసి నీవు అపకీర్తిని మూటగట్టుకుంటావా!” అంది. తర్వాత ఆ రైతు ఆ పామును చూసి కూడా ”నాగన్నా! పో! పో!” అని అనడమే తప్ప తన చేతుల్లో ఉన్న కర్రతో చంపలేదు. అప్పుడు ఆ పాము అతని జాలి గుండెకు ఆశ్చర్యపోయింది. తర్వాత ఆ చిలుక మాటలకు తన మనసు మార్చుకుని ”అయ్యో! నేను తొందరపడి ఈ గొప్ప వ్యక్తికి కీడు తలపెట్టాను. ఇంకా నయం. ఇతన్ని కాటు వేయలేదు! ఈ చిలుక నాకు అతని మంచితనాన్ని చెప్పి నన్ను అతనికి కీడు చేయకుండా కాపాడింది” అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది.
ఆ రైతు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక కుక్క అతన్ని కరవడానికి వచ్చింది. అప్పుడు ఒక పిచ్చుక అది చూసి ”ఓ కుక్కా! ఈ రైతు నీలాంటి కుక్కల్ని పెంచుకొని వాటికి ఆహారాన్ని పెడుతున్నాడు. నీవు తినే ఆ పాల అన్నం ఎవరిదనుకున్నావు? ఈ రైతు కొన్ని పశువులను పెంచుకొని వాటి పాలను పితికి నీ యజమానికి పోస్తున్నాడు. అంతేకాకుండా తాను ధాన్యం పండించి మీ యజమానికి ఇస్తేనే కదా నీవు ఆహారాన్ని తింటున్నావు. దొంగలపై నీవు తిరగబడాలి కానీ నీకు మేలు చేసే అతనిపై తిరగబడుతావా! ఇది నీకు తగునా!” అంది. అప్పుడు ఆ కుక్క ”అయ్యో! పిచ్చుకా! నన్ను క్షమించు. నేను నా మతిమరపు వల్ల అతని మంచితనాన్ని గుర్తించలేదు. నన్ను మన్నించు. నాకు ఉపకారం చేసిన మనిషికి అపకారం చేయబోయాను” అని అది కూడా తన మనసు మార్చుకుని వెళ్ళిపోయింది.
ఆ తర్వాత ఎండకు తాళలేని ఒక ఆంబోతు చెరువులో మునిగి లేచి ఈ రైతునే ఢ కొట్టాలని వేగంగా పరిగెత్తింది. కానీ అదే సమయంలో ఈ రైతు ప్రక్కకు జరిగాడు. ఆ ఆంబోతు పట్టు తప్పి పక్కనున్న ఒక గోతిలో పడింది. వెంటనే రైతు అక్కడి ప్రజలను పిలిచి ఆ ఆంబోతును ఆ గోతి నుండి లాగి కాపాడాడు. తర్వాత అతడు లేగ దూడలను, పశువులను, చివరికి ఆ ఆంబోతుని కూడా ప్రేమతో తన చేతులతో దాని తల పైన నిమిరాడు. అప్పుడు ఆ ఆంబోతు ఆ రైతు చేష్టలకు ఆశ్చర్యపోయింది.
వెంటనే చెట్టు పైన ఉన్న ఒక కాకి అది చూచి ”ఓ ఆంబోతా! ఈ రైతు గురించి నీకు తెలియదా! అతడు పశువులను కన్నబిడ్డలుగా చూస్తున్నాడు. అటువంటి వ్యక్తిని నీవు ఢ కొట్టి క్రింద పడవేయాలని అనుకుంటావా! నీవెంత మూర్ఖుడివి. ఆహారం అందించే అన్నదాతకు నీవు అపకారం తల పెడతావా!” అంది. అప్పుడు ఆ ఆంబోతు కన్నీరు కారుస్తూ ”ఓ కాకీ! నీవన్నది నిజం. అతనికి నేను అపకారం చేయాలనుకున్నాను. కానీ అతడు నన్ను గోతి నుండి కాపాడడమే కాక మా పిల్లలను ప్రేమతో దగ్గరికి తీసుకున్నాడు. అతనికి అపకారం చేయబోయిన నన్ను కూడా ప్రేమతో నిమిరాడు. నీవు అన్నట్లు నేను మూర్ణుడనే. అందరికీ ఉపకారం చేసే ఈ రైతుకు సాయం చేసి కాపాడుకుంటాను. నన్ను మన్నించమని అతన్ని వేడుకుంటాను. నాకు అతని మంచితనాన్ని తెలియజేశావు” అని అంది. దాని మాటలకు ఆ కాకి ఎంతో సంతోషించింది.
– సంగనభట్ల చిన్న రామకిష్టయ్య, 9908554535