కృత్రిమ మేధతో జర్నలిజాన్ని పరీక్షిస్తున్న గూగుల్‌

న్యూయార్క్‌ : కృత్రిమ మేధ(ఏఐ)ను ఉపయోగించి చేసిన ఒక జర్నలిస్టిక్‌ ఉత్పత్తిని గూగుల్‌ పరీక్షిస్తున్నది. ఈ ఉత్పత్తిని ప్రధాన వార్తా సంస్థల ముందుంచాలనే లక్ష్యంగా గూగుల్‌ పనిచేస్తున్నదని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. ఈ రిపోర్టుకు సదరు ఉత్పత్తి తయారీకి దగ్గరగావున్న మూడు వనరుల ఆధారం అని కూడా న్యూయార్క్‌ టైమ్స్‌ తెలిపింది. దీనినిబట్టి గూగుల్‌ ఈ పత్రికను కూడా సంప్రదించినట్టు అర్థమవుతున్నది.
గూగుల్‌ సంస్థలో అంతర్గతంగా ఈ ఉత్పత్తిని జెనెసిస్‌ అని పిలుస్తారు. ఒక విషయంపైన ఎవరు, ఏమిటి, ఎక్కడ లేక ఎప్పుడు అనే లబ్దిదారు ఇచ్చిన సమాచారం ఆధారంగా వార్తలను అందించే సామర్థ్యం ఈ జెనెసిస్‌ సాధనానికి ఉంటుంది. ఇది వార్తా సంస్థల ఉద్యోగులను తొలగించనవసరం లేకుండా ఉపయోగించగలిగే ‘బాధ్యతగల సాంకేతికత’ అని గూగుల్‌ భావిస్తున్నది. అయితే జనరేటివ్‌ కృత్రిమ మేధను ఉపయోగిస్తే ఉద్యోగుల అవసరం ఉండకపోవచ్చు.
జనెసిస్‌ సాధనంవల్ల వార్తా కథనాల్లో యాంత్రికత నెలకొంటుందని జర్నలిస్టులు భావిస్తున్నారు. అయితే జెనెసిస్‌ లక్ష్యం వార్తల రిపోర్టింగ్‌, వాస్తవాలను సరిచూసుకోవటం, సృష్టించటంవంటి పాత్రను పోషించే జర్నలిస్టులను స్థానభ్రంశం చెయ్యాలని కాదనీ, అందుకు బదులుగా శీర్షికలకు ప్రత్యామ్నాయాలను సూచించటం, రాసే స్టయిల్స్‌ను అందించటంగా ఇది ఉంటుందని గూగుల్‌ ప్రతినిధి తెలిపారు. జెనెసిస్‌ జర్నలిస్టులకు ”వ్యక్తిగత సహాయకుడి”గా ఉంటుందని గూగుల్‌ భావిస్తున్నది. నిత్యం చేసే పనులను ఆటోమేట్‌ చేసి ఇంటర్వ్యూలు, రిపోర్టింగ్‌ వంటి క్షేత్ర స్థాయి కార్యకలాపాలపైన దృష్టిని సారించేలా చేస్తుందని గూగుల్‌ అంటున్నది.
జర్నలిజం కోసం చాట్‌ జీపీటీ వంటి సాధనాన్ని గూగుల్‌ తయారు చేస్తుందని తెలిసినప్పుడు అది జెనెసిస్‌తో ఫేక్‌ వార్తల పండోరా బాక్స్‌ను తెరవటంగా ఉంటుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది. గూగుల్‌ కృత్రిమమేధతో ఈ సంవత్సర ఆరంభంలో తయారుచేసిన చాట్‌ జీపీటీ సంక్లిష్ట అసత్య రూపకల్పనలను సత్యాలుగా అందించే సాధనంగా పేరు తెచ్చుకుంది. ఇటువంటి అభూతకల్పనలు కృత్రిమ మేధ నమూనాల్లో కనపడటం సాధారణమేనని, అవి ఎందుకు వస్తాయో, వాటిని నిజాయితీగా చూపటం ఎలానో ఎవరికీ తెలియదని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచ్చారు అన్నాడు. ఒకవేళ గూగుల్‌ గనుక తన సెర్చ్‌ అల్గోరిథమ్స్‌లో కృత్రిమ మేధతో జనరేట్‌ అయిన విషయాలకు ప్రాధాన్యతనిస్తే వాస్తవాలపైన, జరిగిన ఘటనలపైన రాసే వార్తలు అడుగంటుతాయని రేడియో ఎడిటర్‌ గాబె రోజెన్బర్గ్‌ న్యూయార్క్‌ టైమ్స్‌ వ్యాసానికి స్పందనగా ట్రీట్‌ చేసింది.
చాలా ప్రముఖ వార్తా సంస్థలు కృత్రిమ మేధతో కుస్తీ పట్టినా ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. బజ్‌ ఫీడ్‌ వార్తాసంస్థ కృత్రిమ మేధతో తయారు చేసిన క్విజ్‌ల క్వాలిటీ అంతంత మాత్రంగానే ఉంది. కృత్రిమ మేధతో వ్యాసాలు రాయించి వ్యక్తుల పేర్లు పెట్టిన సినెట్‌ సంస్థ ప్రయోగం బెడిసికొట్టింది. ఇన్ని వైఫల్యాలున్నా చాట్‌ జీపీటీని తయారుచేసిన ఓపెన్‌ ఆర్టిఫిసియల్‌ ఇంటెల్లిజెన్స్‌ కంపెనీతో అసోషియేటెడ్‌ ప్రెస్‌ వంటి ప్రముఖ వార్తా సంస్థలు తమతమ న్యూస్‌ రూముల్లో ఈ టెక్నాలజీని వాడటానికి ఒప్పందాలు చేసుకుంటున్నాయి.

Spread the love