గోర్‌ బంజారాల జీవితాలకు దర్పణం

గోర్‌ బంజారాల జీవితాలకు దర్పణంగిరిజన సంచార తెగలు జాతిపరంగాను, భాషాపరంగాను, సంస్కతి సాంప్రదాయాలపరంగాను అందరికీ భిన్నంగా వుంటూనే ఆధునిక సమాజంలోని ప్రధాన స్రవంతిలో కలిసిపోయి జీవితాన్ని గడుపుతున్నారు. బంజారాల జీవన శైలి వేరు, ఆహార్యం వేరు, సాంప్రదాయాలు వేరు. వారి ఈ ప్రయాణంలో అనేక అవరోధాలు, కష్టాలు, కన్నీళ్లు వున్నాయి. నాగరికత అనుకునే సమాజంలో గిరిజనుల శ్రమ దోపిడి ఒక వైపైతే గిరిజన మహిళలపై లైంగిక పీడన మరో వైపు ఇంకా కనపడుతూనే వుంది. అలా గిరిజన తెగలకు చెందిన గోర్‌ బంజారా జీవితాలలోని పలు పార్శ్వాలను కథల ద్వారా వెలుగులోకి తెచ్చిన ఒక చైతన్యవంతమైన ప్రయత్నం ‘కేసులా’.

‘కేసులా’ శీర్షికతో, ‘గోర్‌ బంజారా’ ఉపశీర్షికతో కథల సంపుటిని ప్రొ||సూర్యా ధనంజరు, రమేష్‌ కార్తీక్‌ నాయక్‌ సంపాదకత్వంలో తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురించింది. ప్రధాన సంపాదకుడిగా జూలూరు గౌరీశంకర్‌ వ్యవహరించారు. సాధారణంగా మనం పిలుచుకునే మోదుగు పూలను గిరిజన భాషలో ‘కేసులా’గా వ్యవహరిస్తారు. ‘కేసులా’ గిరిజన సంస్కతికి, శ్రమ శక్తికి, శ్రమ సౌందర్యానికి ప్రతీక. వీరు అడవి తల్లితో మమేకమవుతారు, ప్రకతితో కలిసిపోతారు. సాధారణంగా కొండ గుట్టలు, అడవి ప్రాంతాలలో జీవనం సాగించే వీరు మైదాన ప్రాంతాలలో కూడా ఉంటూ చిన్నపాటి వ్యవసాయపు పనులు చూసుకుంటారు. ‘గోర్‌ మాటి’ పదబంధం లోని ‘గోర్‌’ పదం బంజారా సముదాయంలోని ‘స్వంత తెగకు చెందిన వ్యక్తుల’ను ఉద్దేశించినది. అనగా ఆ సముదాయానికి చెందిన వారేనని అర్ధం. బంజారా సముదాయానికి చెందని బయటి వ్యక్తులను ‘కోర్‌’ అని సంబోధిస్తారు. ‘కేసులా’ శీర్షికతో వచ్చిన సూర్యాధనంజరు కథలో హరిసింగ్‌ చదువుకున్నవాడు, నిరుద్యోగి కావడంతో తాగుడుకు బానిసై భార్యను హింసించడం, చివరికి తాగుడు వల్ల చనిపోతాడు. ఫలితంగా భార్య సోని ఒంటరిదవుతుంది. కష్టకాలంలో మోదుగు చెట్టులా నిబ్బరంగా ఉండాలి అని చనిపోయిన భర్త చెప్పినట్లు ఆమెకు భ్రమ కలుగుతుంది. ఈ కథలో స్త్రీని (సోని) మోదుగు చెట్టుతో పోల్చి చూపే ప్రయత్నం చేస్తుంది రచయిత్రి. సోని పరిస్థితికి కారణం ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వానిదా? మరో మార్గంలో కష్టించి జీవనోపాధిని చూసుకోలేక తాగుడుకు బానిసై బతుకును నాశనం చేసుకున్న హరిసింగ్‌ బలహీనతా? కానీ, ఆ స్త్రీ కష్టాలకు కారణం ఎవరా? అని ఆలోచించాల్సిన అవసరం పాఠకులకు కలుగచేస్తుంది. దేవేంద్ర కథ ‘పిడుగు’ అనే గిరిజన మహిళపై కిష్టయ్య పటేల్‌ కన్నుపడటం, తన ద్వారా లైంగికంగా కలిసి సంతానాన్ని కనివ్వమని అడగటం, సమయం చూసుకొని మేఘి భర్త భూక్యాని అంగడికి పంపించి ఒంటరిగా వున్న మేఘిని తన గుడిసెలోకి రప్పించుకోవడం, బయట వాన, లోపల అలజడి, అనుకోకుండానే కిష్టయ్య మీద పిడుగు పడి చనిపోవడం, నిస్సహాయురాలై వున్న తనను ప్రకతియే కాపాడిందని మేఘి భావించడంతో కథ ముగుస్తుంది. ముగింపు కాస్త సినిమాటిక్‌గా ఉందన్న భావన పాఠకుడికి కలగవచ్చు. తండా ప్రజల ఎదురుదాడి లేదా మరో విధంగానైనా వ్యక్తుల ప్రమేయంతో కిష్టయ్య లాంటి వారికి బుద్ధి చెప్పినట్లు చూపిస్తే బాగుండేది. సుజాత రచన ‘మౌనం ఖరీదు’ కథలో కావేరి పాత్ర గుండెను నులిమేస్తుంది. అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం వలన ఎంత నష్టం జరుగుతుందో, పంచాయతీలలో మధ్య పెద్ద మనుషుల్లా వ్యవహరించే వారి ద్వారా జరిగే అన్యాయం ఎలాంటిదో ఈ కథలో మనం చూడవచ్చు. సిల్మా నాయక్‌ కథ ‘అడ్డ కూలీలు’. ఇందులో మేఘ్లి పాత్ర, మౌనాన్ని దాటి మేస్త్రీ వల్ల పొంచివున్న ప్రమాదాన్ని పసిగట్టి ముందు జాగ్రత్తలు తీసుకొని ఒక ‘ఖచ్చితమైన వైఖరి’ ని ప్రదర్శించి మోసానికి గురికాకుండా బయట పడుతుంది. కానీ మేఘ్లి తల్లి కేస్లీ, మేస్త్రీకి లొంగిపోయి చివరికి మోసానికి గురై ముంబాయి రెడ్‌లైట్‌ ఏరియాలోAIDS రోగంతో మత్యువాత పడుతుంది. జ్వలిత కథ ‘సంకల్పం’. ఊర్ల పంచాయతీ పనుల కోసమో మరో పనికోసమో వచ్చే పెద్ద మనుషులకు, అధికార్లకు వంట చేసిపెట్టే జానమ్మకు ఆ ఊరి మోతుబరి లచ్చునాయక్‌ చేసే రంకాటలు అన్నీ తెలుసు. ఊరి పరిస్థితులు, మహిళలు లైంగికంగా పీడించబడటం, బంజారాల్లోని అపరిశుభ్రత అలవాట్లు అన్నీ తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయత జానమ్మది. ఇలా పల్లె పరిస్థితులను, సంచార జాతుల జీవనశైలిని, బంజారా మహిళలు ఏ విధంగా లైంగికంగా ఊరి మోతుబరి, సర్పంచ్‌ల చేతుల్లో పీడించబడుతారన్న విషయాలను కథలో చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది కథకురాలు. తన చిన్ననాటి స్నేహితురాలు ధ్వాళి బాగా చదువుకొని కలెక్టర్‌ కావడం, మరుగుదొడ్లు కట్టించడం అన్నీ తెలుసుకొని మురిసిపోతుంది జానమ్మ. ఇది ప్రభుత్వం అమలు చేసే స్వచ్ఛ్‌భారత్‌ లాంటి కార్యక్రమాలను గుర్తుకు తెస్తుంది. బంజారా జాతికి చెందిన ధ్వాళి, వారి జాతి మనుషులు మరుగుదొడ్లనే కాదు నీళ్లను కూడా వాడక ఆకులు వాడటం జానమ్మకు వింతగా తోస్తుంది. సంచారజాతుల అలవాట్లు తెలుసుకొని ఆశ్చర్య పోతుంది. ఈ కథ పరిశుభ్రత గురించి, ప్రభుత్వ లక్ష్యాలను, ఉన్నతాధికారుల బాధ్యతల విషయాలపై ఎరుకను కలుగజేస్తుంది. రమేష్‌ కార్తీక్‌ నాయక్‌ కథ ‘దావ్లో,’ బంజారాల్లో పెళ్ళితంతు కార్యక్రమానికి సంబంధించిన కథా వస్తువుతో నడుస్తుంది. కథ చాలావరకు బంజారా భాషలో ఉంటూ వారి పద్ధతులు, సాంప్రదాయాలు కొంత వరకైనా కథ ద్వారా పాఠకులకు అందజేయాలనే తపన కథకుడిలో కనిపిస్తుంది. కథ శీర్షిక ‘దావ్లో’ పెళ్లి వీడ్కోలు సమయంలో పాడే పాట/ విలాప గీతం కావచ్చు. దుఃఖ స్వరంతో పాడుకుంటారు. మంగ్లీ వివాహ సందర్భంలోని దశ్యం ఈ కథా వస్తువు. బంజారా మహిళల ప్రత్యేక దుస్తులు, నగలు బంజారా భాషలో ప్రత్యేకమైన పేర్లతో ఉంటాయి. పెళ్ళైన స్త్రీల ఆభరణాలు వేరుగా ఉంటాయి. ఇవన్నీ ఈ కథలో చూడవచ్చు. బండారు విజయ ‘జుమ్రీ’ కథలో బంజారాల్లో మగపిల్లాడు పుట్టే వరకు స్త్రీ కనాల్సిందేనన్న పంతం పెద్దలకుంటుందని, అలా జరగకపోతే మారు మనువుకు కూడా వెనకాడరన్న సంగతి తెలుస్తుంది. రాందాసుకు నలుగురు ఆడపిల్లలు. దాంతో సమస్య తలెత్తుతుంది. కానీ రాందాసు ధైర్యంగా తాను ఎవరి దగ్గర పనిచేస్తున్నాడో వారి సలహా, సహాయం తీసుకుంటాడు. దానికి విధిత తమ దగ్గర డ్రైవర్‌గా పని చేసే రాందాసు పిల్లలను చేరదీస్తుంది. రాందాసు కూతురు జుమ్రీతో మరో సమస్య రావడం, విదిత ఆ సమస్యనెలా పరిష్కరిస్తుందన్నది ఈ కథలోని సారాంశం. 55 కథల సమాహారంగా వచ్చిన ఈ కథా సంపుటిలో లబ్ద ప్రతిష్టులైన రచయిత్రులు, రచయితలతో బాటు వర్ధమాన రచయిత్రులు, రచయితలూ వున్నారు. బంజార తెగకు చెందిన కథకులు, బంజారేతర కథకులు వున్నారు. అందరి కథలు సహజత్వానికి దగ్గరగా ఉండటం ‘కేసులా’ కథల విశేషం. గిరిజన జీవితాల గురించి, వారి జీవన శైలి, భాష, సాంప్రదాయలపై అవగాహన రావాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే. ఇలాంటి మంచి కథల సంపుటిని వెలుగులోకి తెచ్చిన తెలంగాణ సాహిత్య అకాడమి కషి, సంపాదకుల శ్రమ ప్రశంసించదగినది.
– డా|| రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌,
99088 40196

Spread the love