– మూగజీవాలకు గ్రాసాన్ని అందించడం గొప్ప అనుభూతి
– సహకరించిన నియోజకవర్గ రైతులు
– సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
– ఖమ్మంలోని 11 గోశాలలకు 150 ట్రాక్టర్ల పశుగ్రాసం వితరణ
నవతెలంగాణ-సత్తుపల్లి/ఖమ్మంకార్పొరేషన్
గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలం దక్కుతుందని, గోసంపదతో దేశ సౌభాగ్యం వెల్లివిరుస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి సేకరించిన 150 ట్రాక్టర్ల పశుగ్రాసాన్ని బుధవారం ఖమ్మంలోని 11 గోశాలలకు ఎమ్మెల్యే సండ్ర ఆయన సతీమణి మహాలక్ష్మీతో పాటు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, అదనపు కలెక్టర్ మధుసూదన్‌తో కలిసి బుధవారం పంపిణీ చేశారు. ముందుగా ఖమ్మంలోని టేకులపల్లి గోశాల వద్ద గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించి గ్రాసం వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ మూగజీవాలకు గ్రాసాన్ని అందించడం గొప్ప అనుభూతి కలుగుతోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితోనే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గోశాలలకు గ్రాసాన్ని వితరణ చేయడం జరిగిందన్నారు. సృష్టిలోని సకల జీవరాశులన్నింటి పట్ల కారుణ్య భావన ఉంటేనే మానవ మనుగడ సాధ్యమన్నారు. భారతీయ సంస్కృతిలో గోమాతను దేవతగా భావిస్తారన్నారు. గోసేవ అనేది గొప్ప కార్యక్రమని, మాధవసేవతో సమానమన్నారు. గోవు మన వ్యవసాయానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి ఆధారమన్నారు. సృష్టిలో జీవించే హక్కు మానవులతో పాటు సకల జీవరాశులకు ఉంటుందన్నారు. వ్యవసాయాభివృద్ధి జరగాలంటే పశువులు ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. నోరుండి మాట్లాడగలిగే ప్రతి జీవికి ఏదో రకంగా సయాం అందుతున్న తరుణంలో నోరులేని మూగజీవాలకు సాయం అందించాలనే సంకల్పంతో సత్తుపల్లి నియోజకవర్గ రైతుల సహకారంతో ఐదేండ్ల నుంచి గోశాలలకు గ్రాసాన్ని అందిస్తూ వస్తున్నామన్నామన్నారు. మండెటెండను సైతం లెక్క చేయకుండా 180 కిలోమీటర్ల నుంచి 150 ట్రక్కుల పశుగ్రాసాన్ని అందించేందుకు తామిచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛందంగా సహకరించాలరన్నారు. రైతుల జీవితంతో ముడిపడి ఉన్న గోసంపదని రక్షించాల్సిన ఆవశ్యకత సమాజంపై ఉందన్నారు. గతేడాది భద్రాచలం ప్రాంతంలో గోదావరి వరదలు వచ్చి సర్వస్వం కోల్పోయి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తే నోరులేని జీవాలకు గ్రాసం కొరత ఏర్పడిన నేపధ్యంలో పిలుపు మేరకు గోశాలకు గ్రాసం అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, ఆత్మ ఛైర్మెన్ వనమా శ్రీనివాసురావు, నాయకులు శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, గంగారం, సర్పంచులు వాసురెడ్డి, అద్దంకి అనిల్, చాంద్‌పాషా, అంకమరాజు, పెనుబల్లి, కల్లూరు, వేంసూరు, తల్లాడ మండలాలకు చెందిన నాయకులు పెద్దఎత్తున ఈ వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.