ఆర్టీసీకి సర్కారు బకాయి రూ.1,177 కోట్లు

ఆర్టీసీకి సర్కారు బకాయి రూ.1,177 కోట్లు– నాలుగు నెలల ‘మహాలక్ష్మి’ స్కీం లెక్క ఇదీ…
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గడచిన నాలుగు నెలల్లో టీఎస్‌ఆర్టీసీకి మహాలక్ష్మి స్కీం ద్వారా ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము సొమ్ము రూ.1,177 కోట్లుగా లెక్కతేలింది. టీఎస్‌ఆర్టీసీలో మహాలక్ష్మి స్కీం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం గత ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజుల్లో రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. ఆ తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగి రోజుకు సగటున 29.67 లక్షలకు చేరింది. మహాలక్ష్మి స్కీం ద్వారా డిసెంబర్లో 26.99 లక్షలమంది, జనవరిలో 28.10 లక్షలు, ఫిబ్రవరిలో 30.56 లక్షలు, మార్చిలో 31.42 లక్షల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు. ఏప్రిల్‌ 7వ తేదీ వరకు రూ. 1,177 కోట్ల విలువైన జీరో టికెట్లను ఆర్టీసీ జారీ చేసింది. అంత మొత్తం సొమ్మును మహిళా ప్రయాణికులు ఆదా చేసినట్లేనని ప్రభుత్వం ప్రచారం చేస్తుండగా, ఆ సొమ్మును ఆర్టీసీకి సకాలంలో చెల్లిస్తారా…లేదా? అనే సందేహం యాజమాన్యానికి కలుగుతుంది. మొత్తం చెల్లిస్తారా లేక దానిలో ఏమైనా కోతలు విధిస్తారా అనే విషయంపైనా స్పష్టత లేదు. ఈ సొమ్ము వస్తేనే ఆర్టీసీకి ఉన్న అప్పులు కొంతలో కొంతైనా తీర్చే వెసులుబాటు లభిస్తుంది. ఇప్పటికే కార్మికులకు చెందిన సీసీఎస్‌ బకాయిల చెల్లింపులపై ఆర్టీసీయాజమాన్యం కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కొంటున్నది. ఉద్యోగుల భవిష్యనిధి (పీఎఫ్‌)కు కూడా బారీ మొత్తంగా బకాయి పడిన విషయం తెలిసిందే. మహాలక్ష్మి స్కీం నిధులు ఆర్టీసీకి చెల్లిస్తేనే ఆ సంస్థ మనుగడ సాధ్యమవుతుందని కార్మిక సంఘాలు కూడా చెప్తున్నాయి.

Spread the love