– అసెంబ్లీ కార్యకలాపాలను వీక్షించిన టీఎన్జీవో నేతలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వానికి ఉద్యోగులు గుండెకాయలాంటి వారనీ, వారు క్షేత్రస్థాయిలో పథకాలను సమర్ధవంతంగా అమలుచేయడంతోనే రాష్ట్రంలో మంచి ఫలితాలు వస్తున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) నేతలు శనివారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో మర్యాదపూర్వకంగా ఆయనతో భేటీ అయ్యారు. మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి టీఎన్జీవో కేంద్రసంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్వర్‌తోపాటు, 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. అంతకు ముందు టీఎన్జీవో నేతలు అసెంబ్లీ సమావేశాలను ప్రేక్షకుల గ్యాలరీ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో చట్టసభలు తీసుకున్న నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో అమలుచేసే కార్యనిర్వాహక వ్యవస్థలోని వారే ఉద్యోగులని చెప్పారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదనీ, వారు తమ ఉద్యోగాలను ఫణంగా పెట్టి 42 రోజులు సమ్మె చేశారని గుర్తు చేశారు. తాను కామారెడ్డిలో టీఎన్జీవో భవన నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరు చేశాననీ, దాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలనూ సమానంగా గౌరవిస్తూ మేలు చేస్తున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్రసంఘం కోశాధికారి రామినేని శ్రీనివాస్‌రావు, అసొసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకట్, ముత్యాల సత్యనారాయణగౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ముజీబ్ హుస్సేని, నాయకులు ఆకుల రాజేందర్, రాంకిషన్, పరమేశ్వర్, వెంకట్‌రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని టీఎన్జీవో నేతలు ఘనంగా సన్మానించారు.