– నష్టం భారీగా ఉంటే.. కొందరికే సహాయమా..?
– అందరినీ ఆదుకోవాలి.. పంట నష్టంపై ప్రకటన చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకత్వం డిమాండ్
– బాధితులకు రూ.13 లక్షల వస్తువులు పంపిణీ
– మృతుల కుటుంబాలకు రూ.5వేల చొప్పున సాయం
నవతెలంగాణ-ఏటూరునాగారం ఐటీడీఏ
వరదల్లో కొట్టుకుపోయి.. ఇల్లు కూలి.. సర్వస్వం కోల్పోయిన ప్రజలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, తక్షణమే బాధితులను ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకత్వం డిమాండ్ చేసింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని కొండాయి, మల్యాల, దొడ్ల గ్రామాల్లో సోమవారం రాష్ట్ర నాయకులు పర్యటించారు. 250 కుటుంబాలకు దుప్పట్లు, చీరలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జిల్లావ్యాప్తంగా వరదలకు నష్టపోయిన వెయ్యి కుటుంబాలకు రూ.13 లక్షల విలువైన వస్తువులు, దుస్తులు, వంట సామాగ్రి పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా మృతిచెందిన వారి ఒక్కో కుటుంబానికి రూ.5000 అందజేశారు. అనంతరం సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండారి రవికుమార్, సూడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో గత నెల 26న కురిసిన భారీ వర్షాలకు మూడు మండలాలు 16 గ్రామాల్లో భారీ నష్టం జరిగిందన్నారు.
కొండాయి గ్రామంలో 9 మంది, ప్రాజెక్ట్ నగరంలో ముగ్గురు, జంపన్న వాగులో మరో ఇద్దరు చనిపోయినట్టు చెప్పారు. కొండాయిలో వరద బీభత్సానికి పూర్తిగా నష్టపోయిన కుటుంబాలను ఐటీడీఏ అధికారులు ఏటూరు నాగారం మండల కేంద్రంలో పునరావాసాలకు తరలించి.. చేతులు దులుపుకున్నారని చెప్పారు. కొండాయి, మల్యాల గ్రామల్లో 200 కుటుంబాలకు నష్టం జరిగితే కేవలం 55కుటుంబాలకు రూ.10,000 చొప్పున ఇచ్చి మిగతా కుటుంబాలను వదిలేయడం మంత్రి సత్యవతి విజ్ఞతకే వదిలేస్తున్నట్టు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇండ్లకు ఇంటికి రూ.25వేల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పిన మంత్రికి 55 కుటుంబాలు మాత్రమే కనిపించాయా అని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని మళ్లీ జంపన్న వాగు పెరుగుతుందని అన్నారు.
అలాంటి సమయాల్లో బోటు సౌకర్యం తీసేయడం సరికాదన్నారు. ఆయా గ్రామాల్లో అనారోగ్యాలకు గురైతే వైద్యానికి వెళ్లడానికి ఇబ్బందులు ఏర్పడుతాయని, వెంటనే బోటు సౌకర్యం కల్పించాలని కోరారు. పూర్తిగా ముంపునకు గురైన కొండాయి, మల్యాల గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పక్కా ఇండ్లు కట్టించాలని డిమాండ్ చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని కోరారు.
జిల్లాలో వేలాది ఎకరాలు పంట నష్టం జరిగితే ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.50వేలు భూమి చదును చేసుకోవడం కోసం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కొండాయి బ్రిడ్జిని వెంటనే నిర్మించాలన్నారు. లేదంటే భవిష్యత్తులో కొండాయి, మల్యాల గ్రామాల ప్రజలను సమీకరించి పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బిరెడ్డి సాంబశివ, మండల కార్యదర్శి ఎండి దావూద్, జిల్లా కమిటీ సభ్యులు గొంది రాజేష్, కొండాయి సర్పంచి కాక వెంకటేశ్వర్లు, నాయకులు యాకూబ్, జీవన్, అరుణ్, బట్టు స్వామి తదితరులు పాల్గొన్నారు.