– పేద రాష్ట్రాలకు ఎక్కువ సాయం చేయాల్సిందే
– విలేకర్ల సమావేశంలో పదహారో ఆర్థిక సంఘం
– చైర్మెన్ డాక్టర్ అరవింద్ పనగారియా
– రాజ్యాంగంలోని నియమమదే
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం నగరాల అభివృద్ధి, పట్టణీకరణపై ఎక్కువగా దృష్టి సారించిందనీ, రోజురోజుకి జనాభా పెరుగుతున్న క్రమంలో ఇది మంచి పరిణామమేనని పదహారో ఆర్థిక సంఘం చైర్మెన్ డాక్టర్ అరవింద్ పనగారియా వ్యాఖ్యానించారు. అయితే పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైన్నే ఉంటుందని ఆయన తెలిపారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు విచ్చేసిన ఆర్థిక సంఘం ప్రతినిధుల బందంతో మంగళవారం బేగంపేటలోని ప్రజా భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కార్యదర్శులు హరిత, కృష్ణభాస్కర్ తదితరులు హాజరయ్యారు.
అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పనగారియా మాట్లాడుతూ…దేశంలో అత్యంత పేదరికం ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ఇతోధికంగా సాయం చేయాల్సిందేనని అన్నారు. ఇది రాజ్యాంగంలో పొందుపరిచిన నియమమేనని తెలిపారు. అదే సమయంలో వృద్ధిరేటుతోపాటు స్థూల జాతీయోత్పత్తిలో ముందున్న రాష్ట్రాలకు కూడా ఆర్థిక సాయాలు చేయాల్సి ఉంటుందని అన్నారు. ఆర్థిక సంఘాలన్నీ కేంద్రానికి ఇదే రకమైన సిఫారసులను చేస్తుంటాయని పేర్కొన్నారు. పదహారో ఆర్థిక సంఘం అందుకు భిన్నంగా ముందుకెళ్లబోదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వంతో నిర్వహించిన సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు ఆర్థిక సంఘం, కేంద్రానికి చేయబోయే సిఫారసులు, సూచనలు, సలహాల గురించి వివరించామని తెలిపారు. పట్టణీకరణతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, మహిళాభ్యుదయానికి అధిక నిదులివ్వాలంటూ ఇక్కడి ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందన్నారు. ఆ విజ్ఞప్తిని ఆర్థిక సంఘం సానుకూలంగా పరిశీలిస్తుందని హామీనిచ్చారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటాల పంపకం, సెస్‌లు, సర్ ఛార్జీలు తదితరాంశాలన్నీ విధానపరమైనవనీ, వాటిలో ఆర్థిక సంఘం జోక్యం చేసుకోబోదని పనగారియా ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేంద్ర పన్నుల్లో కేవలం 31 శాతాన్నే రాష్ట్రాలకు పంచుతున్నామనే వాదనలో వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. 41 శాతం మేర ఆ నిధులను పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. ‘ఆర్థిక సంఘం చేసే సిఫారసులను కేంద్రం పట్టించుకోనప్పుడు… అసలు ఆ సంఘం ఉండి ఏం ప్రయోజనం..?’ అని అడగ్గా… పనగారియా జవాబివ్వకుండా దాటవేయటం గమనార్హం.
మీడియా సమావేశంలో పదహారో ఆర్థిక సంఘం సభ్యులు అజరు నారాయణ్ ఝా, అన్నీ జార్జ్ మాథ్యూస్, డాక్టర్ మనోజ్ పాండా, సౌమ్య శాంతి ఘోష్, కార్యదర్శి రిత్విక్ పాండే తదితరులు పాల్గొన్నారు.