ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వ పట్టింపేది

– దోపిడీ ఆగేనా?
– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-చర్ల
కోట్ల రూపాయల విలువచేసే నిర్మాణ రంగంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న గోదావరి ఇసుక కొంతమందికే కల్పవృక్షంగా మారింది. నూతన ప్రభుత్వం కొత్త పాలసీ విధానం తీసుకొస్తామని ఇసుకసురులను కట్టడి చేస్తామని పలకడం తప్ప అక్రమ రవాణాపై ప్రభుత్వానికి పట్టింపేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం స్థానిక బిఎస్‌ రామయ్య భవన్‌లో కారం నరేష్‌ అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. గత ప్రభుత్వం గిరిజన అభివృద్ధి కోసం టీఎస్‌ఎండీసీ వెబ్‌సైట్‌ ద్వారా ఇసుక క్రయవిక్రయాలు చేస్తుండగా ఆదివాసీలు సొసైటీలుగా ఏర్పడి అమ్మకాలు జరిపేది.. ఆ క్రమంలో లోడింగ్‌ చేసినందుకు గిరిజనులకు ట్రాక్టర్దారులకు జీవనోపాధి కలిగేదని అన్నారు. గ్రామంలో ఉన్న యువతి యువకులతో సహా వృద్ధాప్యంలో ఉన్న మధ్యకారు ప్రజలకు ఎంతో జీవనోపాధి దొరికేదని అయితే దానికి విరుద్ధంగా బినామీ గుత్తేదారులు పెద్దపెద్ద యంత్రాలను నడి గోదావరిలోకి దింపి టిప్పర్లతో, ఇసుక లారీలతో ఇసుక విక్రయాలు జరుపుతున్నారని అలా జరపడం వలన ఆదివాసీలకు నానాటికి అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసీల అభ్యుదయానికి వెలిసిన ఐటీడీఏలు నామమాత్రంగా పనిచేయడం వల్ల బినామీ కాంట్రాక్టర్లు ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని కోట్లు దండుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇకనైనా కలెక్టర్‌, భద్రాచలం ఐటిడిఏ పిఓ మండలలో ఉన్న ఇసుక ర్యాంపులపై దృష్టి సారించి ఆదివాసీలకు అన్యాయం జరగకుండా చూడాలి, లేకపోతే అన్ని ఇసుక ర్యాంపుల సొసైటీ మహిళలను చైతన్యపరిచి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బ్రహ్మచారి, కార్యదర్శి మచ్చా రామారావు, పార్టీ మండల కమిటీ సభ్యులు పొడుపు కంటి సమ్మక్క, శ్యామల వెంకట్‌, దొడ్డి హరినాగ వర్మ, పామారు బాలాజీ తదితరులు ఉన్నారు.
తునికాకు కట్టకు మద్దతు ధర ఇవ్వాలి
ఆదివాసీలకు సెకండ్‌ క్రాఫ్‌గా ఉన్న తునికాకు కోతలు త్వరగా ప్రారంభించి తునికాకు కట్టకు మద్దతు ధర కల్పించి ఆదివాసీలను ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. సోమవారం కారం నరేష్‌ అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండు వేసవిలో తునికాకు సేకరణ చేసే ఆదివాసీలకు పాదరక్షకులు, వడదెబ్బ తలగకుండా గ్లూకోజ్‌ వంటి పానీయాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లో తునికాకు సేకరణకు వెళ్లే నిరుపేదలకు పాదరక్షకులు ఇస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఆది నుండి కూడా తునికాకు సేకరణ చేసే ఆదివాసీలకు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని ఆయన మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆదివాసీలకు అన్ని వసతులు కల్పించి తునికాకు సేకరణ జరిగే విధంగా చూడాలని లేకపోతే ఆదివాసీలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. చర్ల అటవీ రేంజ్‌ కు 28 లక్షల స్టాండర్డ్‌ బ్యాగులు తునికాకు సేకరణ లక్ష్యంగా గలదు. 50 ఆకుల కట్టకు రూ.5 కనీస మద్దతు ధర కల్పించాలని ఆయన సూచించారు. ప్రతి స్టాండర్డ్‌ బ్యాగ్‌ కు పదివేల ఆకులు చొప్పున భర్తీ చేయడం జరుగుతుందని బ్యాంకు ఎకౌంటు నెంబర్లు తీసుకునే సమయంలో కలేదార్లు జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. జాగ్రత్త లేకుండా ఎకౌంట్‌ నెంబర్‌ లు రాయడం వలన బోనస్‌ డబ్బులు ఎకౌంట్లో జమ అయ్యేటప్పుడు నానా అవస్థలు గురికావాల్సి వస్తుందని ఆయన తెలిపారు.

Spread the love