– 30ఏండ్లుగా నివాసముంటున్న
– తమకు ఇండ్ల పట్టాలివ్వాలి
నవతెలంగాణ-మిర్యాలగూడ
వివిధ కూలి పనులు చేసుకుంటూ 30 ఏండ్లుగా ప్రభుత్వ భూమిలో జీవిస్తున్న తమకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇప్పించి న్యాయం చేయాలని మిర్యాలగూడ మండలం జంక్ తండా గ్రామస్తులు కోరారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గ్రామస్తులు మాట్లాడారు. 30 ఏళ్లుగా జంకుతండ గ్రామంలోని ప్రభుత్వ భూమిలో గుడిసెలేసుకొని దాదాపు 20 కుటుంబాలు నివసిస్తున్నామన్నారు. కాగా, ఈ భూమిలో గ్రామ పంచాయతీ భవనం నిర్మించాలన్న నిర్ణయంతో తమను ఖాళీ చేయించే ప్రయత్నం చేయడం అన్యాయమన్నారు. ఈ విషయంపై తాము గతంలో ఆర్డీఓ, కలెక్టర్‌కు సైతం వినతి పత్రాన్ని అందించామన్నారు. అయినప్పటికీ మిర్యాలగూడ మండల తహసీల్దార్ కార్యాలయ అధికారులు, తమ స్థలాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తుండటంతో హైకోర్టును సైతం ఆశ్రయించామన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం తగు విచారణ చేసి నివాసం ఉంటున్న వారికి న్యాయం చేయాలని చెప్పినప్పటికీ వినలేదని ఆరోపించారు. జంకుతండా సర్పంచ్, అధికార పార్టీ నేత మాలోత్ రవీందర్ నాయక్ పేదల అధీనంలో ఉన్న భూమిని ప్రభుత్వ భూమిగా, పట్టా భూమిగా చూపించి గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పేరుతో స్వాహా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.