అసైన్డ్‌ భూముల్లో ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం

Government real estate business in assigned lands– ఆక్రమణలపై త్వరలో హైకోర్టులో పిల్‌: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అసైన్డ్‌ భూములతో రాష్ట్ర ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నదని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ) రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ విమర్శించారు. పేదలకు చెందిన 30 వేల ఎకరాల అసైన్డ్‌ భూములను బలవంతంగా సర్కారు గుంజుకున్నదని ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బలవంతంగా గుంజుకుంటున్నదని తెలిపారు. బహుజన వాదిననే ముసుగులో దళితులను పదేండ్ల నుంచి కేసీఆర్‌ నిండా ముంచుతున్నారని విమర్శించారు. భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్ర శేఖర్‌ ఆజాద్‌ను ఉత్తర భారతదేశం నుంచి అరువుకు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. పేదల భూముల్లో స్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు కడుతున్న ప్రభుత్వం కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత ఫామ్‌ హౌస్‌లలో డంపింగ్‌ యార్డ్‌లు,స్మశాన వాటికలు కడితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. పేద రైతుల దగ్గర భూములను గుంజుకుని బడా బాబులకు బినామీలకు అమ్ముకుంటున్నారని తెలిపారు. ప్రయివేట్‌ వ్యక్తులకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్‌ భూములపై విచారణ జరిపిస్తామన్నారు. బలవంతపు అక్రమణలపై త్వరలోనే హైకోర్టులో పిల్‌ వేస్తామని తెలిపారు.
సమావేశంలో రాష్ట్ర కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ వెంకటేష్‌ చౌహాన్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ క్వీన్‌, రాష్ట్ర సెక్రెటరీ గుండెల ధర్మేంధర్‌, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాచమల్ల జయసింహ, భూ రక్షణ సమితి నాయకులు మైసయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love