– టూరిస్ట్ స్పాట్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
– చారిత్రక, అధ్యాత్మిక, పురావస్తు ప్రాంతాల గుర్తింపు
– కష్ణ, గోదావరి పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
– ఏకో టూరిజంపై మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో కమిటీ
– డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్ టూరిస్టులకు ప్రత్యేక ప్యాకేజీలు
– త్వరలో ప్రణాళిక విడుదల చేయనున్న పర్యాటకశాఖ
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ సర్కార్ టూరిజంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రపంచంలోని వనరులు అంతగా లేని అనేక దేశాలు టూరిజంపై వచ్చే ఆదాయంతోనే మనుగడ సాధిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నో అద్భుతాలున్న ఆ రంగాన్ని ఆదాయ మార్గంగా మార్చుకోలనే లక్ష్యంతో చారిత్రక, అధ్యాత్మిక, పురావస్తు, ఏకో మొదలగు అన్ని రకాల పర్యాటకంపై ప్రభుత్వం దృష్టి సారింది. త్వరలో ఇందుకు సంబంధించి ప్రణాళిక విడుదల చేయనున్నట్టు సమాచారం.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ఏర్పడ్డ ఏడాది 2014లో 7కోట్ల మందికి పైగా దేశీయ పర్యాటకులు, 75 వేల మందికి పైగా విదేశీ పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శించారు. ఆ తర్వాత 2015, 2016, 18 సంవత్సరాల్లో తొమ్మిది కోట్లు దాటిన టూరిస్టుల సంఖ్య ఆ తర్వాత క్రమంగా తగ్గుకుంటూ వస్తున్నది. 2020,21 సంవత్సరాల్లో అయితే కరోనా వల్ల పర్యాటకుల సంఖ్య మూడు కోట్లకు పడి పోయింది. పర్యాటక రంగంపై గత ప్రభుత్వం దృష్టి సారించక పోవడంతో టూరిస్టుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. పర్యాటక, అతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ, అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్ల సమ్మేళనంలో ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా చారిత్రక, సాంస్కృతిక, అధ్యాత్మిక ప్రాంతాలు, వారసత్వ కట్టడాలు, సహజ జల వనరులు, అడవులు, కొండలు, కోనలు, కోటలు, ప్రకృతి రమణీయతను ఆస్వాదించే ప్రాంతాలు పర్యాటక ప్రాంతాల్లో పీపీపీ పద్దతిన ప్రాజెక్ట్‌లు చేపట్టేందుకు వారితో చర్చలు మొదలు పెట్టింది పర్యాటక శాఖ. హైదరాబాదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా టూరిజానికి గుర్తింపు తెచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
వెడ్డింగ్ డిస్టినేషన్‌కు పుష్కలమైన అవకాశాలు
రాష్ట్ర నలుమూలల ఉన్న పర్యాటక ప్రాంతాలను వెడ్డింగ్ డెస్టినేషన్ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా శ్రీశైలం వయా సోమశిల, నాగర్జున సాగర్ వరకు ఉన్న 160 కిలోమీటర్ల మేర నల్లమల అడవుల గుండా ప్రవహిస్తున్న కృష్ణా నదీ తీరం, దట్టమైన అడువులు, వన్యప్రాణులు, జలపాతాలను డెస్టినేషన్ కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. రాష్ట్రంలో అన్ని రకాల టూరిజాన్ని అభివృద్థి చేసి, పర్యాటకులను ఆకర్శించేందుకు విసృత ప్రచారం కల్పించనున్నారు. రాష్ట్రాన్ని సందర్శించే దేశీయ, విదేశీ పర్యాటకుల కోసం పర్యాటక శాఖ త్వరలో ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించనున్నట్టు సమాచారం.
టూరిస్ట్ హబ్‌గాహైదరాబాద్
తెలంగాణ అంటేనే హైదరాబాద్… హైదరాబాద్ అంటేనే తెలంగాణ అనేటంతగా అన్ని రంగాల్లో ప్రాచుర్యం పొందిన నగరం.దేశ, విదేశీ పర్యాటకులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఈ నగరాన్ని టూరిస్ట్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నగరంలోని చార్మినార్, గోల్కొండ, సాలార్‌జంగ్ మ్యూజియం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం, అమరవీరుల స్థూపంతో పాటు అనేక అధ్యాతిక, చారిత్రక ప్రాంతాలను కలుపుతూ టూరిస్ట్ సర్క్యూట్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే మూసీని లండన్‌లోని థేమ్స్ నదీ తీరం తరహాలో రూ. 70 వేల కోట్లతో అభివృద్ధి చేసేందుకు పలు కంపెనీలతో ఇప్పటికే ఒప్పందం కుదిరింది. భవిష్యత్‌లో నగరంలో మరిన్నీ టూరిస్ట్ ప్రాంతాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ కసరత్తు చేస్తున్నది.
అధ్యాత్మిక టూరిజం
రాష్రంలో అధ్యాత్మిక ప్రాంతాలకు కొదవ లేదు. యాదాద్రి లక్ష్మనర్సింహ స్వామి, వేమూలవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాలు రాష్ట్రంలో బహుళ ప్రాచుర్యం పొందాయి. దేశ, విదేశాలనుంచి పర్యాటకులు తరలి వస్తారు. వీటిలతో పాటు కాళేశ్వరం, ధర్మపురి, కొండగట్టు, మంథని తదితర పుణ్యక్షేత్రాలను కలుపుతూ టెంపుల్ టూరిజం కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఆయా ప్రాంతాలను సందర్శించే వారికి టూరిజం శాఖకు చెందిన ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. ఏకో టూరిజం మాదిరిగానే ఆధ్యాత్మిక టూరిజాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రభత్వం కసరత్తు చేస్తున్నది.
ఏకో టూరిజం
అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో ఏకో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మార్చి 14న ఓ కమిటీని ఏర్పాటు చేసింది. పరిశ్రమలు, గిరిజన, దేవాదాయ కమిషన్లతోపాటు మొత్తం 17మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే సమావేశమైన ఈ కమిటీ ఏకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టింది. పర్యావరణానికి, వన్య ప్రాణులకు హాని కలగకుండా, వాటి సహజ ఆవాసాలను పరిరక్షిస్తూ, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ ఎకో టూరిజం పాలసీని తీసుకు రానున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 12 సర్క్యూట్లలో 40 స్పాట్లను గుర్తించారు. అడ్వెంచర్, రీక్రియేషన్, ఆధ్యాత్మిక, వారసత్వ, సినీ, వెడ్డింగ్, నేచర్ అండ్ వైల్డ్ లైఫ్, హెరిటేజ్ అండ్ కల్చర్ తదితర అంశాల ఆధారంగా మరిన్ని ప్రాంతాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టనున్నారు. అటవీ, దేవాదాయ, రెవెన్యూ, పర్యాటక శాఖలు సమన్వయం చేసుకుని ఆ పాలసీని రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.