నవతెలంగాణ – హైదరాబాద్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి నేపథ్యంలో, ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం ఆయన తన రాజీనామా పత్రాన్ని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు పంపారు. తాజాగా, జగన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. అయితే, నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ సీఎంగా ఉండాలని జగన్ ను గవర్నర్ కోరారు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలతో ఎంతో గొప్పగా గెలిచిన వైసీపీ… 2024 ఎన్నికల్లో పాతాళానికి పడిపోయింది. కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ 135 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, జనసేన 21 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. వైసీపీ 11 సీట్లతో మూడో స్థానంలో ఉంది. బీజేపీకి 8 స్థానాలు లభించాయి.