గవర్నర్లు-సమాఖ్య వ్యవస్థ

 Sampadakiyamతమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తీరు మారలేదు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాల్సింది పోయి ఒక సంఘ్‌ కార్యకర్తలా వ్యవహరించడం తీవ్ర అభ్యంతరకరం. తమిళనాడు ప్రభుత్వంతో నిత్యం విభేదిస్తూ వార్తల్లో నిలిచే వివాదాస్పద గవర్నర్‌ కూడా ఈయనే. చట్టాల అమలుకు సంబంధించిన అంశాల నుంచి సంస్కృతుల పద్ధతుల వరకు గవర్నర్‌ దాడిచేస్తుంటే రాష్ట్రపతి కలగ జేసుకోకపోవడం కడు విచిత్రం! నాలుగు రోజుల కిందట తమిళనాడులో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల నుంచి ఆర్‌ఎన్‌ రవి వాకౌట్‌ చేశాడు. శాసనసభ నుంచి గవర్నర్‌ వాకౌట్‌ చేయడం దేశచరిత్రలో, అందులో ఆయనే కావడం ఇది మూడోసారి. అధికారిక ప్రసంగ ప్రారంభం సందర్భంగా తన అభ్యర్థన మేరకు జాతీయగీతాన్ని ప్లే చేయలేదని ఆయన వాదన. దీంతో ప్రసంగం ఇవ్వకుండానే వెనుదిరిగాడు. ఇది గౌరవమైన స్థానంలో ఉన్న వారు చేయాల్సిన పనికాదు.
భిన్నత్వంలో ఏకత్వంగా కలిసుండే దేశంలో ఏ రాష్ట్ర ప్రత్యేకత ఆ రాష్ట్రానిదే. మన రాష్ట్రానికొస్తే ‘జయజయహే తెలంగాణ’ మన రాష్ట్రగీతం.అలాగే తమిళ ప్రభుత్వ కార్యక్రమలన్నింటినీ తమిళ్‌తారు వాజ్తు (తమిళ తల్లికి ఆహ్వానం)తో ఆరంభించి, జాతీయ గీతాలాపనతో ముగించడం 1976 నంచి వస్తున్న సంప్రదాయం. ఈ విషయం ముందుగానే ప్రభుత్వం చెప్పినప్పటికీ, దాన్ని అంగీకరించకపోగా ‘ద్రావిడ నాడు’ భావనపై అభ్యంతరాలు చెబుతూ వివాదాన్ని లేవనెత్తడం సమాఖ్య భావనకు తూట్లు పొడవడమే తప్ప మరొకటి కాదు. రాష్ట్రాల యూని యన్‌ అయిన భారత దేశంలో గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడమనేది హుందాతనం. ప్రసంగంలో స్ఫూర్తినిచ్చే అంశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాలపై వివరించడమనేది ఎక్కడైనా జరిగేదే. కానీ ఆర్‌ఎన్‌ రవి అందుకు భిన్నం. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన స్థానంలో ఉండి ‘ఇది యురోపియన్‌ సిద్ధాంతం.భారతదేశంలో దీనికి చోటు లేదు’ అని వ్యాఖ్యానించడం విషాదకరం. డీఎంకె ప్రభుత్వం కొలువుదీరిన దాదాపు ఈ రెండేండ్ల కాలంలో ప్రతి అసెంబ్లీ సమావేశంలోనూ ఏదో ఒక వివాదంతో వాకౌట్‌ చేయడం పరిపాటిగా మారింది.
దేశంలో సాంఘిక అసమానతలు రూపుమాపేందుకు పోరాడిన విప్లవ సంఘసంస్కర్త పెరియర్‌ ఇవి రామసామి నాయకర్‌, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన మహనీయుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, కామరాజ్‌, అన్నాదురై, కరుణానిధి పేర్లను కూడా చదవడానికి కూడా నిరాకరించాడీ గవర్నర్‌. ఎందుకీ విద్వేష అసూయ? ఎవరిపైనా ఇంతటి అక్కసు? జాతీయగీతాన్ని అవమానించారని గగ్గోలుపెట్టిన గవర్నర్‌ మరి, అంబేద్కర్‌, పెరియర్‌ లను అవమానించినట్టు కాదా? రాజ్యాంగం కల్పించిన హక్కుతోనే కదా గవర్నర్‌ పదవిని చేపట్టింది. ఏకంగా రాజ్యాంగ నిర్మాత పేరునే ఉచ్ఛరించడానికి ఇష్టపడని వ్యక్తి నిజంగా ఆ పదవికి అర్హుడేనా? ఇలాంటి సంకుచిత, మతతత్వ భావాలు గల వ్యక్తులను ఎలా చూడాలి? ఏమని సంభోదించాలి? అందుకే ఆర్‌ఎన్‌ రవి చర్యల్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ‘పిల్లచేష్టలు’గా అభివర్ణించారు. వెంటనే ‘రీకాల్‌’ చేయాలని డీఎంకె ఎంపీ కనిమొళితో సహా ఇతర నేతలంతా కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.
ఒక్క తమిళనాడే కాదు, కేరళ, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌, కర్నాటక సహా బీజేపీయేతర రాష్ట్రాల్లో కేంద్రంచే నియమించబడిన గవర్నర్లు ప్రభుత్వాలతో కయ్యానికి దిగడం, అసెంబ్లీలు ఆమోదించిన బిల్లుల్ని వెనక్కి పంపించడం, తాత్సారం చేయడం, పాలనను బాహాటంగానే విమర్శించడం కొంతకాలంగా జరుగుతున్న తంతు. అందుకే రాజ్‌భవన్‌లు రాజకీయ కేంద్రాలవుతున్నా యని వస్తున్న విమర్శల్లో అవాస్తవేమీలేదు. మొన్నటివరకు తెలంగాణలో కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గవర్నర్‌ తమిళిసై కూడా సభలు, సమావేశాల్లో బహిరంగంగానే కేసీఆర్‌ ప్రభుత్వాన్ని విమర్శిం చారు. అంతేకాదు, ఏకగ్రీవంగా ఆమోదించిన ఎమ్మెల్సీ పేర్లను కూడా వెనక్కి పంపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుపైనా అభ్యంతరాలు తెలిపారు.
వ్యక్తిగతంగా ప్రాథమిక హక్కుల్లో ఎవరు ఎలాంటి అభిప్రాయాలనైనా వెల్లడించవచ్చు. ఇది కూడా రాజ్యాగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ. అంతమాత్రాన రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్నవారు దాన్ని విస్మరించడం అత్యంత బాధాకరం. నూతన విద్యావిధానంలో భాగంగా ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ముసాయిదా-2025 ప్రతిపాదనల్లో కూడా గవర్నర్లకు అధికారాలనిచ్చే విధానాల్ని చేర్చారు. ఇప్పటికే రాష్ట్రాల్లో యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్ల నియామకాల్లో గవర్నర్లు అడ్డుతగులుతున్నారు. ఇప్పుడు దీన్ని విద్యావంతులు ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలి. అలాగే రాష్ట్ర మంత్రిమండలి సూచనలు,సలహాల మేరకే గవర్నర్‌ వ్యవహరించాలని 1974లోనే ఏడుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. దానికి అనుగుణంగా గవర్నర్లు నడవాలే కానీ రాజకీయ పార్టీల విధానాలు అమలు చేసే పరిస్థితికి రాకూడదు. అలా వ్యవహరిస్తే గనుక అది రాజ్యాంగ విరుద్ధం.

Spread the love