నవతెలంగాణ – హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం లభించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. సంబంధిత దస్త్రం రెండు రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం. హైదరాబాద్‌లో జరిగిన కార్ రేసుకు సంబంధించి ఉల్లంఘనలు జరిగాయని, నిర్వహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో, ఒప్పందానికి ముందే నిధులు చెల్లించారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, దీనిపై విచారణ చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థ (ఎంఏయూడీ)… అక్టోబరులో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు ఫిర్యాదు చేసింది. సంబంధం లేని హెచ్‌ఎండీఏ ఒప్పందం చేసుకోవడం, రిజర్వు బ్యాంకు ముందస్తు అనుమతి లేకుండానే రెండు దఫాలుగా రూ.46 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం దీనికి హెచ్‌ఎండీఏ బోర్డు అనుమతి లేకపోవడం తదితర అంశాలను అందులో పేర్కొన్నట్లు తెలిసింది.