– నాలుగు కేటగిరీల్లో వ్యక్తులు, సంస్థలకు ఎనిమిది అవార్డుల ప్రదానం
– రాజ్‌భవన్ వేదికగా ఇవ్వడం దేశంలో ప్రథమం
– 2019 నుంచి తెలంగాణలో పని చేసిన వారే అర్హులు
– నేటినుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
– వాటి సమర్పణకు తుది గడువు 23 : గవర్నర్ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ప్రతి ఏటా గవర్నర్ ప్రతిభా పురస్కారాలను అందజేయనున్నట్టు గవర్నర్ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, వికలాంగుల సంక్షేమం, క్రీడలు, ఆటలు, సాంస్కృతిక రంగంలో పనిచేసిన వ్యక్తులు, సంస్థలు, ట్రస్టులు, సొసైటీలకు ఈ అవార్డులను ప్రదానం చేస్తామని అన్నారు. నాలుగు కేటగిరీల్లో నలుగురు వ్యక్తులు, నాలుగు సంస్థలను ఎంపిక చేస్తామన్నారు. ఈ అవార్డు కింద రూ.రెండు లక్షల నగదుతోపాటు ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేస్తామని వివరించారు. ఐదేండ్లుగా అంటే 2019 నుంచి తెలంగాణలో ఆయా కేటగిరీల్లో పనిచేసిన వ్యక్తులు లేదా సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. తెలంగాణలో పనిచేసిన వ్యక్తులు, సంస్థలు ఉండాలనీ, ఇక్కడ పనిచేస్తున్న తెలంగాణేతరులు కూడా ఉండొచ్చని స్పష్టం చేశారు. నాలుగు కేటగిరీల్లో అత్యుత్తమ విజయాలను ప్రోత్సహించడం, అభివృద్ధి కోసం చేసిన కృషికి గుర్తింపునిచ్చేందుకు ఈ అవార్డులు దోహదపడతాయని వివరించారు. గవర్నర్ ప్రత్యేకంగా జ్యూరీ కమిటీని పద్మవిభూషణ్, ఆస్కి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మెన్ పద్మనాభయ్య నేతృత్వంలో ఏర్పాటు చేశారని చెప్పారు. ఎంపిక కమిటీ అన్ని దరఖాస్తులనూ పరిశీలించి అర్హులైన వారిని అవార్డుల కోసం ఎంపిక చేస్తుందన్నారు. ఒకవేళ దరఖాస్తుల్లో సరైన వ్యక్తులు లేదా సంస్థల్లేకుంటే ఆ కమిటీ నేరుగా ఎంపిక చేసే అవకాశముందని అన్నారు. రాజ్‌భవన్ వేదికగా గవర్నర్ పేరుతో అవార్డులను ప్రదానం చేయడం దేశంలోనే ఇదే ప్రథమమని వివరించారు. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి అవార్డులను ప్రదానం చేయడం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌తోపాటు ముఖ్యమంత్రి కూడా హాజరవుతారని అన్నారు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. వాటి సమర్పణకు ఈనెల 23న సాయంత్రం ఐదు గంటల వరకు గడువుందని చెప్పారు. ఆన్‌లైన్‌లో https://governor.telangana.gov.in ద్వారా దరఖాస్తులను సమర్పించొచ్చని సూచించారు. అందులో దరఖాస్తు ఫారం అందుబాటులో ఉందనీ, డౌన్‌లోడ్ చేసుకోవాలని వివరించారు. ఆఫ్‌లైన్‌లో గవర్నర్ ముఖ్య కార్యదర్శి, గవర్నర్ సెక్రెటేరియట్, రాజ్‌భవన్, సోమాజిగూడ, హైదరాబాద్ -500041 అడ్రస్‌కు స్పీడ్ పోస్టు ద్వారా అన్ని పత్రాలతో సమర్పించాలని కోరారు. గవర్నర్ మారినా ఈ అవార్డుల ప్రదానం కొనసాగు తుందనీ, దీనిపై ఎవరికీ ఇబ్బంది ఉండబోదని స్పష్టం చేశారు. జూన్ రెండు నాటికి కాలుష్య రహిత రాజ్‌భవన్‌గా తీర్చిదిద్దాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లక్ష్యంగా నిర్దేశించుకున్నారని వివరించారు. ప్రజా రాజ్‌భవన్‌గా మారుస్తామం టూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారని గుర్తు చేశారు. అందులో భాగంగా వికలాంగుల సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడే జరుగుతు న్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జాయింట్ సెక్రెటరీ భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.