– విలీనాన్ని స్వాగతిస్తున్నా.. అనేక అనుమానాలు..
– ప్రయివేటీకరణ దిశగా తీసుకెళ్తారేమోనని ఆందోళన
– టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై భిన్నస్వరాలు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి సోమవారం తీసుకున్న నిర్ణయాన్ని ఆ సంస్థ ఉద్యోగులు స్వాగతిస్తున్నారు. అయితే వారిని పలు అనుమానాలు వెంటాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సందర్భంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే కార్పొరేట్ ఎలక్ట్రిక్ బస్సుల రూపంలో టీఎస్‌ఆర్టీసీ పెట్టుబడుదారుల చేతుల్లోకి వెళ్తున్న దశలో ఉన్నపళంగా సీఎం కేసీఆర్ తీసుకున్న ప్రభుత్వంలో విలీన నిర్ణయంపై ఉద్యోగుల్లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం తరహాలోనే విలీనం చేసి ఆ తర్వాత ప్రయివేటీకరణకు పూనుకునే యోచన ఏమైనా ఉందా అనే అనుమానాలను కూడా ఆర్టీసీ సంఘాలు వెలిబుచ్చుతున్నాయి. ఈ విలీన ప్రక్రియలో ప్రభుత్వం చూపే చిత్తశుద్ధిపైనే ఆర్టీసీతో పాటు ఆ సంస్థ ఉద్యోగుల భవితవ్యం ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఏపీలో ఆర్టీసీ పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు కొన్ని కార్మిక సంఘాలు సమాయత్తం అవుతున్నాయి.
వెసులుబాట్లు ఉంటాయా..?
రాష్ట్రంలోని 40వేలకు పైగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తుండటాన్ని స్వాగతిస్తున్నా.. విలీనంతో ఇప్పుడున్న అనేక వెసులుబాట్లను కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందేమో అన్న భయం సిబ్బందిలో ఉంది. దీనిలో ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన 2017, 2021 పీఆర్సీలు, అలాగే 2013లో బాండ్ల రూపంలో ఉన్న 50శాతం పీఆర్సీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఇంకా 160 డీఏ, ఒకాయిల చెల్లింపుల వంటి అంశాల ప్రస్తావన ప్రభుత్వ ప్రకటనలో లేదు. ప్రస్తుతం కార్పొరేషన్‌గా ఉండటంతో కార్మిక సంఘాలు సమస్యలపై ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వంలో విలీనంతో ట్రేడ్ యూనియన్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. యూనియన్లు ఉండకుంటే తమ సమస్యలను ఎవరికి చెప్పకోవాలని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీలో ఉన్న సీసీఎస్ (సెంట్రల్ కోఆపరేటివ్ సొసైటీ) సౌకర్యం, ఎస్‌ఆర్‌బీఎస్, ఎస్‌బీటీ బీమా, అన్‌లిమిటెడ్ వైద్య సౌకర్యాన్ని కోల్పోయి రూ.3 లక్షల వరకే వైద్యం ఖర్చులు పరిమితమవుతాయి. అంతకుమించితే చేతి నుంచి చెల్లించాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా రాష్ట్రంలో దాతలు సమకూర్చిన ఎన్నో విలువైన ఆస్తులు ఆర్టీసీకి ఉన్నాయి. విలీనం అంటే సిబ్బంది మాత్రమే. సంక్షేమం కూడా అమలవుతుందా? అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ అయితే ఆర్టీసీ ఆస్తుల మాట ఏంటనేది ప్రశ్నార్థకంగా ఉంది.
వేతనాలు, పనిగంటలపై సందేహాలు..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి సౌకర్యాలున్నాయో తమకు కూడా అలాంటివే కల్పించాలని ఆర్టీసీ ఉద్యోగులు ఆకాంక్షిస్తున్నారు. ప్రభుత్వ క్లరికల్ పోస్టుకు సమాన వేతనం ఇక్కడి కండక్టర్లకు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటిలాగా 14, 15 గంటల డ్యూటీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే 8 గంటల పనివిధానం కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానవేతనం ఇవ్వడంతో పాటు పెన్షన్ సౌకర్యం కల్పించాలంటున్నారు. ఆర్టీసీ విస్తరణతో పాటు ప్రయాణీకుల ప్రయోజనాలనూ దృష్టిలో ఉంచుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వంలో విలీనం చేసినా ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల్లో వ్యత్యాసం ఉందని, ఇక్కడా అదే పరిస్థితి ఉండకుండా చూడాలని కోరతున్నారు.
ప్రయివేటీకరణ ప్రమాదం..!
టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో ప్రయివేటీకరణకు మార్గం సుగమం అయ్యే అవకాశాలు లేకపోలేదని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఒక్కో బస్సుకు రూ.కోటి సబ్సిడీతో 500 ఎలక్రిక్ బస్సులు, ఒక్కో బస్సుకు రూ.50 లక్షల సబ్సిడీతో 3,500 ఎలక్ట్రిక్ బస్సులను టీఎస్‌ఆర్టీసీలో కార్పొరేట్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో భవిష్యత్తులో ప్రయివేటీకరణ ఊపందుకునే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.