వర్షంలోనూ జీపీ కార్మికుల సమ్మె

GP workers strike in rain

– మోకాళ్లపై నిలబడి నిరసన
నవతెలంగాణ- విలేకరులు
తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు గురువారం జోరు వానలోనూ కొనసాగించారు. ఏండ్ల తరబడి గ్రామాల్లో వెట్టిచాకిరీ చేస్తున్నా గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. వీరికి పలువురు నేతలు మద్దతు తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట చేపట్టిన పంచాయతీ కార్మికుల సమ్మెకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.సలీం మద్దతు తెలిపి మాట్లాడారు. చండూరు, గట్టుప్పల్‌, గుర్రంపోడు మండల కేంద్రాలో వర్షంలోనూ ఆందోళన చేశారు. బీబీనగర్‌లో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లా చివ్వెలం, పెన్‌పహాడ్‌ మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల ఎదుట జోరు వానను సైతం లెక్కచేయకుండా సమ్మె కొనసాగించారు.
మోకాళ్లపై నిల్చొని నిరసన
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రం మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు గ్రామపంచాయతీలో చాలా ఏండ్లుగా వెట్టిచాకిరీ చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కల్పిస్తూ పర్మినెంట్‌ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Spread the love