– పోటీ కార్మికులకు దండాలు
– మా బతుకులు ఆగం చేయొద్దని వేడుకోలు
– కొనసాగుతున్న సమ్మె : మద్దతు తెలిపిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నవతెలంగాణ- విలేకరులు
సమస్యలు పరిష్కరించాలని.. తమ బతుకులు బాగు చేయాలని గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం భిక్షాటన చేశారు.. పలుచోట్ల ఒంటి కాలుపై నిలబడి ధర్నా చేశారు. ర్యాలీలు నిర్వహించారు. కార్మికులు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు మద్దతు తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలంలో పచ్చి గడ్డి తింటూ నిరసన తెలిపారు. రెబ్బెనలో ఒంటి కాలుపై నిలబడ్డారు. చింతలమానేపల్లిలో కార్మికులు వంటావార్పు చేపట్టారు. నేరడిగొండ మండల కేంద్రంలో కార్మికులు వీధుల్లో తిరుగుతూ దుకాణాల్లో భిక్షాటన చేశారు. వికారాబాద్ పట్టణంలో కార్మికులు అర్ధనగ ప్రదర్శన నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి, కడ్తాల్ మండల కేంద్రంలో కార్మికుల భిక్షాటన చేశారు. మంచాలలో దీక్షలకు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ మద్దతు తెలిపారు.
ట్రాక్టర్ డ్రైవర్‌గా మారిన సర్పంచ్
12 రోజులుగా జీపీ కార్మికులు సమ్మె చేయడంతో గ్రామాల్లో పారిశుధ్య పనులు నిలిచిపోయాయి. గ్రామాల్లో మురికి, చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వస్తుందని గ్రామస్తులు సర్పంచుల దగ్గరికి వెళ్లి వివరించారు. కార్మికులు ఎవరూ లేకపోవడంతో వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం పెద్ద ఉమ్మెంతల్ సర్పంచ్ శ్రీధర్‌గుప్తా తానే ట్రాక్టర్ డ్రైవర్‌గా మారారు. గ్రామంలో వీధి వీధి తిరుగుతూ చెత్తను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో గ్రామాల్లో ప్రజలు తమను ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందన్నారు.
మహబూబ్‌నగర్ రూరల్ మండలంలో గ్రామపంచాయతీ కార్మికులు అర్ధ నగంగా నిరసన తెలిపారు. బాలానగర్ మండలంలో రహదారిపై మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో భిక్షాటన చేశారు. తెలకపల్లి మండల పరిధిలోని రాకొండ గ్రామంలో పోటీ కార్మికులు తమ పనులు చేయొద్దంటూ జీపీ కార్మికులు వారికి దండం పెట్టి.. రోడ్డుపై బైటాయించారు.
ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం మండలంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కార్మికులకు మద్దతు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం రూరల్‌లో ఎమ్మెల్యే పొదెం వీరయ్య మద్దతు తెలిపారు. అశ్వారావుపేటలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు.
యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్‌లో జీపీ కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పైళ్ల గణపతిరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రామన్నపేటలో ర్యాలీ నిర్వహించారు. నల్లగొండ జిల్లాలోని నకిరేకల్‌లో జీపీ కార్మికుల సమ్మెకు కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున మద్దతు తెలిపారు. చిట్యాలలో సమ్మెకు జర్నలిస్టులు మద్దతు తెలిపారు. కొండమల్లేపల్లిలో పట్టణంలో అధికారులు ఇతర గ్రామాల నుంచి కూలీలను తీసుకొచ్చి రోడ్లను శుభ్రం చేయిస్తుండగా.. కార్మికులు అడ్డుకున్నారు. అడ్డుకున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
సూర్యాపేట జిల్లా కోదాడలో జీపీ కార్మికుల సమ్మెకు కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కోటగోపి సంఘీభావం తెలిపారు. పట్టణంలోని ప్రధాన రోడ్డుపై కార్మికులు భిక్షాటన చేసి, గరిడేపల్లి మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. అనంతగిరి మండల కేంద్రంలో గ్రామంలో చెత్తను ట్రాక్టర్‌తో తొలగిస్తుండగా కార్మికులు అడ్డుకున్నారు.
పంచాయతీ కార్మికుల నినాదాలతో దద్దరిల్లిన సిరిసిల్ల
సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం : కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు
నవతెలంగాణ – సిరిసిల్ల
గ్రామ పంచాయతీ కార్మికుల భారీ ర్యాలీ, నినాదాలతో సిరిసిల్ల పట్టణం దద్దరిల్లింది. వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని.. సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు బహిరంగ సభ నిర్వహించారు. అక్కడి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి మానవహారంగా ఏర్పడ్డారు. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల కార్మికులు పెద్దఎత్తున తరలివచ్చారు.
ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగుమంటి ఎల్లారెడ్డి అధ్యక్షత వహించగా.. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు కార్మికులనుద్దేశించి మాట్లాడారు. గ్రామాల్లో ప్రజలకు ప్రత్యక్ష సేవలందిస్తున్న 50వేల మంది పంచాయతీ సిబ్బంది 12రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం వివక్ష చూపడమేనని అన్నారు. మోడీ స్వచ్ఛ భారత్, కేసీఆర్ పచ్చదనం పరిశుభ్రత పిలుపును చిత్తశుద్ధితో అమలు చేసిన పంచాయతీ కార్మికులకు దక్కిన ఫలితం ఏమీ లేదన్నారు. పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామని సీఎం వాగ్దానం చేసి 9ఏండ్లు గడిచినా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం రూపొందించిన జీవో నెంబర్ 60 ప్రకారంగా గ్రామపంచాయతీ సిబ్బందికి రూ.19వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వేతనాలు పెంచకపోవడంతో సిబ్బంది ఆరోగ్యాలు, పిల్లల చదువులు, సరైన భోజనం చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు కార్మికులు మరణించినా ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మూషం రమేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎంపీటీసీ మల్లారపు అరుణ్ కుమార్, ఎర్రవెల్లి నాగరాజు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.