ప్రగతి సింగారంలో దర్జాగా ప్రభుత్వ భూముల కబ్జా

– చేతులు మారుతున్నలావణి పట్టా భూములు
– చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
– ఎమ్మెల్యే ‘చల్లా’ స్వగ్రామంలో పరిస్థితి
– క్వారీ భూముల అమ్మకాలు, క్రీడా ప్రాంగణ భూముల ఆక్రమణ
నవతెలంగాణ-శాయంపేట
వ్యవసాయ భూముల ధరలు ఆకాశాన్ని అంటడంతో భూ కబ్జాదారులు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ, లక్షలాది రూపాయలకు భూములు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. క్రషర్‌ యజమానులు క్వారీల్లో బండరాళ్లను తొలగించడంతో గుట్టలు కనుమరుగు కాగా, భూ కబ్జాదారులు యధేచ్ఛగా చెరువులోని పూడికతీత మట్టితో గుంతలను పూడ్చి, వ్యవసాయ భూములుగా మార్చివేసి విక్రయాలు చేపడుతున్నారు. సర్వే నెంబర్‌ 138లో లావణి పట్టా భూములను విక్రయిస్తూ లక్షల్లో లాభాలు గడిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. కాగా, ఈ భూమి పరకాల ఎమ్మెల్యే స్వగ్రామం ప్రగతి సింగారంలోనిది కావడం విశేషం.
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్వగ్రామమైన మండలంలోని ప్రగతి సింగారం గ్రామంలో సర్వే నెంబర్‌ 138లో 53 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలోనే పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, రైతు వేదిక నిర్మాణాలను చేపట్టారు. అప్పయ్య పల్లె గ్రామానికి చెందిన గుజ్జుల కాశీరాంకు ప్రగతి సింగారం శివారులో వ్యవసాయ భూములు అధికంగా ఉండటంతో 30 ఏండ్ల కిందట దళితులు అతనిపై పోరాటం చేయడంతో 2-10 ఎకరాల భూములను దళితులకు అప్పగించారు. మిగతా పట్టా భూములను, అసైన్డ్‌ భూములను విక్రయించుకున్నాడు. వీరి వద్ద భూములు కొనుగోలు చేసిన రైతులకు, అసైన్డ్‌ భూములను సాగు చేస్తున్న దళితులకు గొడవలు తలెత్తుతున్నాయి. చిలికి చిలికి గాలి వానలా భూ పంచాయితీ చివరికి అధికార పార్టీ నాయకుల వద్దకు శుక్రవారం చేరగా భూమికి సంబంధించిన కాగితాలు తీసుకురావాలని, క్షేత్రస్థాయిలోకి వెళ్లి చుట్టుపక్కల రైతులను విచారించి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.
క్వారీ భూములు కబ్జా..
ప్రగతి సింగారం గ్రామ శివారులో ఉన్న క్వారీల్లో క్రషర్‌ యజమానులు గుట్టల్లో బాంబు పేలుళ్లు చేసి బండరాళ్లను తొలగించి కంకర, డస్ట్‌ తయారు చేసి విక్రయిస్తుండటంతో గుట్టలు కరిగిపోయి మైదాన ప్రదేశాలు వచ్చాయి. కాశి కుటుంబీకులు పెద్దపెద్ద బండ రాళ్లను యంత్రాల సహాయంతో కట్టుబడి రాళ్లుగా తయారుచేసి విక్రయించుకుంటున్నారు. భూ కబ్జాదారులు ఈ భూములపై కన్నేసి మైదానంలో ఏర్పడిన గుంతలను గ్రామంలోని చెరువుల నుంచి తోడిన మొరం మట్టితో పూడ్చివేసి వ్యవసాయ భూములుగా మార్చారు. ఈ భూములను లక్షలాది రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
క్రీడా ప్రాంగణ భూముల కబ్జా..
ప్రగతి సింగారం గ్రామంలోని ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించి క్రీడా ప్రాంగణ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. దాంతో స్థానిక సర్పంచ్‌ పోతు సుమలత రమణారెడ్డి అధికారులు సూచించిన స్థలంలో క్రీడా ప్రాంగణం పనులు మొదలు పెట్టగా ఆ స్థలం తమదేనంటూ స్థానిక కాలనీవాసులు అడ్డుకున్నారు. ఇదే విషయమై సర్పంచ్‌.. స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు క్రీడా ప్రాంగణం బోర్డు, పరికరాలను తీసుకురాగా స్థానికులు బోర్డును ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడంతో నేలపైనే బోర్డు దర్శనమిస్తుంది. ఇదే విషయమై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా కలెక్టర్‌ ఆదేశాల మేరకు డీపీవో క్రీడా ప్రాంగణ భూములను ఆక్రమించుకున్న వారి నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. డీపీవో ఆదేశాల మేరకు రెండు గుడిసెలను తీసివేసినప్పటికీ, మరొకరు అడ్డుకోవడంతో క్రీడా ప్రాంగణ పనులు నిలిచిపోయాయి. దాంతో యువకులకు క్రీడా ప్రాంగణం అందుబాటులో లేకుండా పోయింది.
మూడు కుంటలు అక్రమణ..
ప్రగతి సింగారం గ్రామంలోని పోచమ్మ కుంట, కరక్కుంట, ఇప్పలకుంట చెరువులను సమీపంలోని భూములను కబ్జా చేసి కుంటల విస్తీర్ణాన్ని పూర్తిగా కుదించారు. కుంటలు యధేచ్ఛగా కబ్జాకు గురవుతున్నా నీటిపారుదల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో రాబోయే రోజుల్లో కుంటలు అంతరించిపోయే ప్రమాదం ఉందని రైతులు పేర్కొనడం గమనార్హం. కుంటలు అంతరించిపోతే కుంటల కింద సాగయ్యే ఆయకట్టు రైతుల పరిస్థితి ఏమిటని, పంట సాగు ఎలా చేసుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, సర్పంచ్‌ పోతు సుమలత రమణారెడ్డి స్వగ్రామమైన ప్రగతి సింగారం గ్రామంలో ప్రభుత్వ భూములను భూకబ్జాదారులు యధేచ్ఛగా కబ్జా చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భూక బ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని కాపా డాలని ప్రజలు కోరుతున్నారు.
క్షేత్రస్థాయి విచారణలో చర్యలు తీసుకుంటాం
ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసినా రిజిస్ట్రేషన్‌ జరగదు. పీఓటీ -1977 యాక్ట్‌ ప్రకారం ప్రభుత్వ భూములను రెగ్యులరైజ్‌ చేయడంతో గతంలో వారికే పాస్‌ పుస్తకాలు జారీ చేస్తాం. కుంటలను సమీప రైతులు కబ్జా చేసినా, వాటి హద్దులు నిర్ణయించి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను కాపాడుతాం. క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయకుండా అధికారులను అడ్డుకుంటే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం.
– చలమల్ల రాజు, తహసీల్దార్‌

Spread the love