వందలాది కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా

– యధేచ్చగా నిర్మాణాలు
– భూ కబ్జా దారుల వెనుక ఎవ్వరూ
– 817 సర్వే నెంబర్ ఆక్రమణ
– ఎస్సి స్టడీ సర్కిల్ కు కేటాయించిన స్థలంలో కట్టడాలు
– కమిషనర్ ఆదేశాలు బేఖాతర్
– నిద్రావస్థలో రెవెన్యూ అధికారులు
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి అధికారుల సాక్షిగా.. కబ్జాకు గురువుతోంది. ఈ తతంగమంతా తెలిసి కూడా చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు చేష్టలూడిగి చూస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి, రాజకీయ అండదండలతో కబ్జాదారులు చెలరేగిపోతున్నారు.  జిల్లా కేంద్రంలో భూముల విలువలు ఆకాశాన్నంటుతుండడంతో అందరి దృష్టి ఇటువైపే కేంద్రీకృతమవుతోంది. అయితే రాజకీయ నాయకుల అండతో కబ్జాదారులు అధికారులపై ఒత్తిళ్లు తెస్తూ తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.ఈ క్రమంలో పట్టణ నడిబొడ్డున  భూముల ఆక్రమణ యధేచ్చగా సాగుతోంది. అయితే ఇంత పెద్ద ఎత్తున కబ్జాల పర్వం కొనసాగుతున్నప్పటికీ అధికారులు ఆశించిన రీతిలో స్పందించక పోవడం అనుమానాలకు తావిస్తోంది.

పట్టణంలోని సద్దుల చెరువు కట్టా కు అనుకోని ఉన్న జేజే నగర్ లోని నవోదయ హాస్టల్ ప్రక్కనే 817 సర్వే నెంబర్ లో ఎకరం 20 గుంటల ప్రభుత్వ భూమి ఉండేది.కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆనాటి ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి సూచన మేరకు ఈ సర్వే నెంబర్ లో ఎస్సి హాస్టల్ నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు.కానీ ఆ నాటి పరిస్థితుల దృష్ట్యా ఆ స్థలం బురద తో పాటు నడవడానికి వీలు లేని విధంగా భయానకంగా ఉండడంతో అక్కడ ఎస్సి హాస్టల్ నిర్మాణ ప్రతిపాదనలను విరమించుకున్నారు. ఇక అనంతరం ఎమ్మెల్యే గా జగదీష్ రెడ్డి గెలవడం సూర్యాపేట జిల్లా కావడంతో పాటు అభివృద్ధి వేగం అందుకోవడం వెనువెంటనే జరిగిన విషయం తెల్సిందే. ఇందులో భాగంగానే గత 2018 ఎన్నికలకు ముందు 817 సర్వే నెంబర్ లో కొంత భాగాన్ని కుమ్మరి సంఘం భవనానికి కేటాయించి నిర్మాణం కూడా పూర్తి చేసిన విషయం తెల్సిందే. ఇదే క్రమంలో 20 గుంటల స్థలంలో ఎస్సి స్టడీ సర్కిల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి భావించారు. అందుకు తగ్గట్టుగా ఆ స్థలంలో ఫౌండేషన్ వేయడంతో పాటు 20 గుంటల చుట్టూతా ఫెన్సింగ్ ఏర్పాటు చేయించారు.                     కాలక్రమంలో ఎం జరిగిందో తెలియదు కాని ఎస్సి స్టడీ సర్కిల్ సెంటర్ కు కేటాయించిన స్థలం అన్యాక్రాంతం అవుతూ వచ్చింది. ఇక్కడే మిగిలిన ప్రభుత్వ భూమి ని కొందరూ తోచిన రీతిలో ఇష్టానుసారంగా కబ్జాలకు పాల్పడ్డారు.దీంతో హైటెక్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు కబ్జాదారులకు ఫలహారంగా మారుతున్నాయి. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి యధేచ్చగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.ఇటివలే అధికార పార్టీకి చెందిన కొందరు ఈ భూమిని ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టగా వాటిని మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు కూల్చివేశారు. కాగా పది రోజుల వ్యవధిలోనే మున్సిపల్ అధికారులు కూల్చివేసిన నిర్మాణాల స్థలంలో తిరిగి బహిరంగంగా పునర్నిర్మాణాలు చేపట్టడం గమాన్హారo.అధికారులు, స్థానిక నాయకుల అండదండలతో రేయింబవళ్లు  నిర్మాణాలు చేపడుతూ కబ్జా కాలనీని సృష్టించారు. ఇంతా తతంగం జరుగుతున్న రెవెన్యూ అధికారులలో చలనం లేకపోవడం పట్ల వెల్లువెత్తుతున్నాయి. వారి అండదండలతో కొన్ని రోజులుగా కబ్జాదారులు ఇక్కడ రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దాదాపుగా ఎకరం 20 గుంటలు ఉన్న స్థలంలో ప్రభుత్వం కొన్నింటికి కేటాయించగా ఇక మిగిలిన స్థలం పూర్తిగా కబ్జాకు గురికావడంతో ఇండ్లు లేని నిరుపేదలు ఆ స్థలాన్ని తమకు కేటాయించి న్యాయం చేయాలని మంత్రి ని కోరుతున్నారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం గజం ధర 25000 రూపాయలు నడుస్తోంది. ఎంతో “”కాస్ట్లీ”” భూమిని కబ్జాదారులు అప్పనంగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్న తీరు పై ప్రజలు విస్తుపోతున్నారు.వీటిని అడ్డుకునే నాథుడే లేడా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అక్రమార్కులను నిరోధించేందుకు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా యుద్దప్రాతిపదికన ఆక్రమణకు గురైన సర్కారు భూములను రక్షించేందుకు చర్యలు మొదలు పెట్టాలని పలువురు సూచిస్తున్నారు. దీనికితోడుగా సర్కారు భూములను కాపాడేందుకు కంచెలు ఏర్పాటు చేసి ఆక్రమణలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
Spread the love