మిల్లులకు పోటెత్తిన ధాన్యం

Grain poured into the mills– మద్దతు ధర కోసం రైతుల రాస్తారోకో
– అధికారుల పర్యవేక్తణ కరువు
– ఎమ్మెల్యే, అదనపు కలెక్ఱర్‌ చెప్పినా వినని మిల్లర్లు
– నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, మేములపల్లిలో రైతుల ఆందోళన
నవతెలంగాణ-మిర్యాలగూడ/వేములపల్లి
నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, మేములపల్లి పరిసర ప్రాంతాల మిల్లులకు ఆదివారం భారీ ఎత్తున ధాన్యం లోడ్లతో రోడ్ల వెంట ట్రాక్టర్లు బారులు తీరాయి. దాంతో మిల్లర్ల యజమానులు సాకులు చెబుతూ తక్కువ ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దాంతో రైతులు ఆందోళన వ్యక్తం చేసి రాస్తారోకో నిర్వహించారు. మిర్యాలగూడ రైస్‌ మిల్లులకు ఆదివారం ఒక్కరోజే 8వేల ట్రాక్టర్లకుపైగా ధాన్యం రాగా కొనుగోళ్ల ప్రక్రియ నిలిచిపోయింది. కోదాడ రోడ్డు వైపు యాద్గార్‌పల్లి మిల్లుల్లో శైలోలు నిండిపోవడంతో ఉదయం 11గంటల వరకు ధాన్యం కొనుగోళ్లు నిలిపివేశారు. దాంతో ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రోడ్లపైనే ట్రాక్టర్లను నిలిపి రైతులు రాస్తారోకో చేశారు. కాగా నల్లగొండ రోడ్డులో వేములపల్లి మండల పరిధిలోని రైస్‌మిల్లుల వద్ద ట్రాక్టర్లు భారీ ఎత్తున తరలివచ్చాయి. రోడ్డుపై ఒక ట్రాక్టర్‌ ప్రమాదానికి గురై రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో 2గంటల పాటు ధాన్యం ట్రాక్టర్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. మరోవైపు ధాన్యాన్ని రైతులు మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ రాస్తారోకో చేశారు. రోడ్డుపై ప్రమాదానికి గురైన ట్రాక్టర్‌ను అద్దంకి- నార్కట్‌పల్లి రహదారి అధికారులు తొలగిం చడంతో పలు మిల్లుల వద్ద ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. మహీంద్ర, పద్మ చింట్లు రకాలైన సన్న రకం ధాన్యానికి రూ.2150- రూ.2250 వరకు ధరలు వేస్తున్నారని రైతులు ఆరోపించారు.
అదనపు కలెక్టర్‌, ఎమ్మెల్యే సమీక్ష చేసినా అందని మద్దతు
రైతుల ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలంటూ శనివారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో మిర్యాలగూడ రైస్‌ మిల్లర్లతో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్‌ కలెక్టర్‌ నారాయణ్‌ అమిత్‌.. 8గంటల సమీక్ష నిర్వహించారు. సన్నరకం ధాన్యాన్ని రూ.2320 నుంచి రూ.2400 వరకు కొనుగోలు చేయాలని సూచించారు. రైస్‌ మిల్లర్లు చెప్పిన దానికి అంగీకరించారు. తీరా ఆదివారం మిల్లుల వద్ద భారీగా ట్రాక్టర్లు బారులు తీరడంతో పచ్చి గింజ, తేమశాతం అధికంగా ఉందని, ధాన్యం రంగు మారిందని, పలురకాల సాకులతో రూ.2150 నుంచి రూ.2250 వరకు కొనుగోలు చేశారు. కాగా ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్‌ చెప్పినా రూ.2300లోపు ధరకు ధాన్యం కొనుగోలు చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పండించిన పంటను మిల్లర్లు గంటల వ్యవధిలోనే దోచుకుంటున్నారని ఆరోపించారు.
కొనుగోళ్లు నిలిపివేసిన మిల్లర్లు
వేముపల్లి మండలంలోని శెట్టిపాలెం సమీపంలో 15 రైస్‌ మిల్లులు ఉండగా మూడు, నాలుగు రైస్‌ మిల్లులు మాత్రమే ధాన్యాన్ని కొనుగోళ్లు చేస్తున్నాయి. మిల్లర్లు సిండికేట్‌గా మారి కొన్ని మిల్లులు మాత్రమే కొనుగోలు చేయడంతో ధాన్యం లోడ్లు రహదారికి ఇరువైపులా నిలిచిపోయాయి. ఎన్నో వ్యయ ప్రయాసాలతో పండించిన పంటను కనీస మద్దతు ధరకు అమ్మకోలేక శెట్టిపాలెం సమీపంలో మిల్లుల వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై సుమారు గంటసేపు రాస్తారోకో నిర్వహించారు. అన్ని మిల్లులు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని బీష్మించుకు కూర్చున్నారు. దాంతో ఆదివారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మిల్లులు తిరిగి.. రూ.2,300 నుంచి రూ.2,320ల వరకు రకాన్ని బట్టి ధర చెల్లించాలని యాజమానులకు సూచించారు. కాగా, అప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు చేసిన మిల్లులు.. మరుక్షనం ఖరీదు లేవంటూ కొనుగోళ్లను నిలిపివేశారు. రెండు మూడేండ్లుగా రూ.2600 నుంచి రూ.2900 వరకు ధర పలికిన సన్నధాన్యం కొనే దిక్కు లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ధాన్యం అమ్ముకోలేక ఇబ్బందులు పడుతుంటే అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ధాన్యానికి రూ.3వేల వరకు చెల్లించాలని రైతులు కోరుతున్నారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న.. రెవెన్యూ, పోలీస్‌ అధికారులు రైతులకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు.
రైతులకు క్వింటాకు రూ.3 వేలు చెల్లించాలి: పాదూరి
రైతులు పండించిన ధాన్యానికి క్వింటాకు రూ.3 వేలు చెల్లించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పాదూరి శశిధర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. గతంలో 3వేలు పెట్టి కొనుగోలు చేసిన మిల్లర్లు ప్రస్తుతం ఖరీదు లేదంటూ చౌకగా కొనేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మిల్లర్లు సిండికేట్‌గా మారి రైతులను దోచుకుంటున్నారన్నారు. జిల్లా అధికారులు మిల్లుల్ని సందర్శించి కొనుగోలు చేయని మిల్లులపై చర్య తీసుకోవాలని కోరారు.

Spread the love