– ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కోడిగుడ్లు, టమోటాలతో దాడి
– ఎమ్మెల్యే కాన్వాయ్‌పై చెప్పులు విసిరేసిన కాంగ్రెస్ నాయకులు
– గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత
నవతెలంగాణ-కమలాపూర్
ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులను ఎంపిక చేసేందుకు ఏర్పాటుచేసిన కమలాపూర్ గ్రామసభ రసాభాసగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కోడిగుడ్లు, టమోటాలు విసరడంతో అప్పటి వరకు ప్రశాంతంగా జరుగుతున్న గ్రామసభలో ఏం జరుగతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. కమలాపూర్ మండల కేంద్రంలో నిర్వహించే గ్రామ సభకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో గుండె బాబు ప్రభుత్వ పథకాల లబ్దిదారుల జాబితాను చదువుతుండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామని చెప్పి సంవత్సరం గడుస్తున్నా ఇవ్వడంలేదని, సుమారు 1700 మందిలో 20 మందికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో లబ్ది చేకూరడం కోసం ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నదని అన్నారు. దాంతో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రసంగానికి అడ్డు తగులుతూ వేదిక మీదికి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించడంతో భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వేదిక నుంచి కిందికి దిగి గ్రామస్తుల వద్దకు వచ్చి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులూ ఎమ్మెల్యేపై ఎదురుదాడికి దిగారు. గత పదేండ్లలో బీఆర్‌ఎస్ ప్రజలను మోసం చేసిందని, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. దాంతో ఇరు పార్టీల మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేయడంతో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కుర్చీలు పట్టుకొని కాంగ్రెస్ నాయకులపైకి వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు టమాటాలు, కోడిగుడ్లతో దాడులు చేశారు. దాంతో రసాభాసగా మారింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాకౌట్ చేసి వెళ్లిపోతూ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దుర్భాషలాడారు. ‘నీ అబ్బ మీకు కొంచెం అన్న ఇజ్జత్ ఉండాలె, బీఆర్‌ఎస్ పార్టీ బీఫామ్‌పై గెలిచినోడు నా మోచేతి నీళ్లు తాగినోడు.. పూటకో పార్టీలు మారే మీరు మనుషులేనా..” అని తీవ్ర పదజాలంతో దూషించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కాన్వారు వైపు పరుగులు తీసి చెప్పులు విసిరారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలువరించారు. ఏసీపీ తిరుమల్ పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీలు మారిన చరిత్ర మర్చిపోయి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో తమకు నచ్చిన పార్టీలో చేరే స్వేచ్ఛ ఉన్నదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి తెలియకపోవడం బాధాకరమని అన్నారు.