గ్రాండ్ మాస్ట‌ర్ ప్ర‌ణీత్

చిన్ననాటి నుంచే అన్నింట చురుకు. బొమ్మలు గీసేవాడు. నటనతోనూ మెప్పించే వాడు. టెన్నిస్‌ ఆడేవాడు. ఈతలో మేటి. కానీ ఒక రోజు అతణ్ని.. నలుపు, తెలుపు రంగుల్లో ఉన్న 64 గళ్ల చెస్‌ బోర్డు ఆకర్షించింది. నాన్న పావులను కదుపుతున్న తీరు ఆసక్తి రేకెత్తించింది. ఆరేండ్ల వయసులో పావులు కదపడం నేర్చిన ఈ హైదరాబాదికీ…తరువాత చదరంగమే తన లోకమైంది. ఆటపై ఉన్న ప్రేమే ఇప్పుడతడ్ని గ్రాండ్‌మాస్టర్‌ను చేసింది. చదరంగ యువ సంచలనం ఉప్పల ప్రణీత్‌ పదిహేనేండ్ల వయసులోనే భారత 82వ గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు సాధించాడు. గత నెలలోనే మూడో జీఎం నార్మ్‌ దక్కించుకున్న ప్రణీత్‌.. తాజాగా 2500 ఎలో రేటింగ్‌ సాధించాడు. ప్రణీత్‌ విజయ సోపానం నేటి జోష్‌.
గ్రాండ్‌మాస్టర్‌ హోదా సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆరేండ్ల వయసులోనే చెస్‌ ఆడడం మొదలెట్టాను. చిన్నప్పుడు టెన్నిస్‌ ఆడేవాణ్ని. ఈతంటే ఇష్టం. ఓ రోజు నాన్న చెస్‌ ఆడుతుంటే ఆసక్తిగా చూస్తూ ఉండిపోయాను. అది గమనించి అమ్మానాన్న ప్రోత్సహిం చారు. అండర్‌-7లో రాష్ట్ర ఛాంపియన్‌గా నిలవడంతో ఇక చదరంగాన్ని వదల్లేదు. 2015లో ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ జీఎం టోర్నీలో 220ఎలో రేటింగ్‌ పాయింట్లు సాధించి ఒకే ఛాంపియన్‌ షిప్‌లో అత్యధిక పాయింట్లు గెలిచిన ఆటగాడిగా జాతీయ రికార్డు సష్టించాను. దీంతో చెస్‌ ఆడగలను అన్న ఆత్మ విశ్వాసం మరింత పెరిగింది. అదే ఏడాది ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించాను. అప్పుడు సీఎం కేసీఆర్‌ అండగా నిలిచారు. వెన్నుతట్టి ప్రోత్సహించారు. 2018లో అండర్‌-11లో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలవడం నా కెరీర్‌లో గొప్ప మలుపు. కష్టపడితే ఆటలో అత్యున్నత శిఖరాలకు చేరుకోవచ్చని నిజంగా అప్పుడే నమ్మాను. అక్కడి నుంచి నా ఆటపై మరింత దష్టి సారించాను. 2021లో అండర్‌-14 జాతీయ ఛాంపియన్‌గా నిలిచాను. ఆసియా దేశాల ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నీలో స్వర్ణం సాధించా. నిరుడు ఆగస్టులో అంతర్జాతీయ మాస్టర్‌ (ఐఎమ్‌) హౌదా సాధించాక జీఎంపై గురిపెట్టాను.
హైదరాబాద్‌కు మాకాం
మాది నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామం. ఆ తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. నాన్న శ్రీనివాసాచారి జీఎస్టీలో అసిస్టెంట్‌ కమిషనర్‌. అమ్మ ధనలక్ష్మి ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాను. విదేశాల్లో టోర్నీలు, నా శిక్షణ కోసం ఎంతో ఖర్చుపెడుతూనే ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా.. నా కెరీర్‌ ఆగిపోవద్దనే ఉద్దేశంతో నాన్న ఓ ఫ్లాట్‌ కూడా అమ్మేశారు. కొన్నిసార్లు ఓటమి నిరాశ కలిగించినా.. విజయాల వైపు పట్టుదలతో ముందుకు సాగాను. కోచ్‌లు రవి, నరసింహారావు వద్ద ఓనమాలు నేర్చుకున్న నేను.. ఆ తరువాత 2021 వరకు ప్రముఖ కోచ్‌ ఎన్‌వీఎస్‌ రామరాజు సార్‌ అకాడమీలో చేరి చెస్‌పై పట్టు సాధించాను. ఆయన శిక్షణలోనే ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ (ఐఎం) హోదా సాధించాను. ప్రస్తుతం ఇజ్రాయెల్‌ గ్రాండ్‌మాస్టర్‌ విక్టర్‌ మిఖిలెవస్కీ (ఇజ్రాయెల్‌) వద్ద శిక్షణ తీసుకుంటున్నాను. ఆన్‌లైన్‌లో ఆడడం కంటే కూడా నేరుగా బోర్డుపై ఆడడామే నాకు ఇష్టం. బ్లిట్జ్‌, ర్యాపిడ్‌ కంటే క్లాసికల్‌ విభాగ మంటేనే నాకిష్టం. నీమన్‌ (అమెరికా)పై విజయం ఎప్పటికీ ప్రత్యేకమే. బలమైన ప్రత్యర్థిపై గెలుపుతో పాటు జీఎం హోదా కూడా దక్కింది. ఇక నా రేటింగ్‌ను 2800కు పెంచుకోవాలి. ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడంతో పాటు ఒలింపియాడ్‌లో దేశానికి పతకం అందించడంలో కీలకపాత్ర పోషించాలన్నది నా లక్ష్యం.
ఆనంద్‌, కార్ల్‌సన్‌కు అభిమానిని..
చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ సార్‌ ఆట చూస్తూ పెరిగాను. బాల్యం నుంచి ఆయనంటే ప్రత్యేకమైన అభిమానం, గౌరవం. విదేశీ ప్లేయర్లలో మాగస్‌ కార్ల్‌సన్‌ ఆట శైలంటే నాకు చాలా ఇష్టం.
వరల్డ్‌ చాంపియన్‌ గా నిలుస్తా..
నా పదేళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కింది. కొవిడ్‌ లాక్‌డౌన్‌ లేకపోతే ఇంకా ముందు గానే జీఎం టైటిల్‌ సాధించే వాడిన్ని. మొత్తానికి నా స్వప్నం సాకారమైంది. నన్ను ఈ స్థాయికి చేర్చడానికి అమ్మానాన్న ఎంతో కష్టపడ్డారు. జీఎం టైటిల్‌ దక్కిందని తెలియగానే వాళ్లు ఎంతో సంతోషించారు. ఇన్నా ళ్లూపడిన కష్టమంతా మర్చి పోయారు. కొంచెం విరామం తీసుకొని వచ్చే నెలలో జరిగే ఆసియా కాంటి నెంటల్‌ చెస్‌ పోటీలకు సిద్ధమవు తున్నాను. అంతిమంగా 2800 టాప్‌ ఎలో రేటింగ్‌ సాధించాను. వరల్డ్‌ చాంపియన్‌ కిరీటాన్ని సొంతం చేసుకోవాలనేదే నా లక్ష్యం. ఇందుకోసం మరింత శ్రమిస్తాను. ఈ విషయంలో ఇప్పుడిప్పుడే మెరు గవు తున్నాను. భారత్‌ నుంచి పలు వురు యువ ఆటగాళ్లు గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌ సాధి స్తుండటం ఈ ఆటకు ఎంతో మేలు చేస్తుంది. కజకిస్తాన్‌లో త్వరలో జరిగే ఆసియా చాంపియన్‌షిప్‌లో పతకం సాధించడమే నా తదుపరి లక్ష్యం.
అత్యున్నత స్థాయిలో పోటీ పడాలన్నా, మెరుగైన శిక్షణ తీసుకోవాలన్నా, విదేశాల్లో టోర్నీలు ఆడేందుకు వెళ్లాలన్నా చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఇప్పటికైతే ఆర్థికంగా ఆదుకోవడానికి నాకు స్పాన్సర్‌ లేరు. గ్రాండ్‌మాస్టర్‌ హోదా టైటిల్‌తో నాకు స్పాన్సర్‌లు లభిస్తారని ఆశిస్తున్నాను.
తెలంగాణ నుంచి..
భారత చెస్‌లో తెలంగాణ నుంచి గతంలో ఇరిగేశి అర్జున్‌ (2018), హర్ష భరతకోటి (2019), రాజా రిత్విక్‌ (2021), రాహుల్‌ శ్రీవాత్సవ్‌ (2022)ఈ ఘనత సాధించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇప్పటికే పెంటేల హరికష్ణ (2001), హంపి (2002), హారిక (2011), లలిత్‌ బాబు (2012), కార్తీక్‌ వెంకటరామన్‌ (2018) గ్రాండ్‌మాస్టర్‌ హోదా పొందారు.
రాష్ట్ర ప్రభుత్వ సహకారం
తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశాను. అప్పుడు సీఎం చెప్పిన మాటలు నాలో స్ఫూర్తి నింపాయి. దాదాపు పదిహేను నిమిషాల పాటు నాతో మాట్లాడి వివరాలు తెలుసుకొని భవిష్యత్తులో మరింత రాణించాలని సూచించారు. సీఎం మాటలు అందించి స్ఫూర్తితో ఈ రోజు గ్రాండ్‌మాస్టర్‌గా ఎదిగాను. సీఎం ప్రోత్సాహంతో మున్ముందు కూడా మరింతగా సత్తాచాటుతాను.
జీఎం హోదా ఖరారైంది ఇలా
– ఈ టోర్నీలో ప్రణీత్‌ నలుగురు గ్రాండ్‌మాస్టర్లు వహాప్‌ సనాల్‌ (తుర్కియే), వుగార్‌ అసాదిల్‌ (అజర్‌బైజాన్‌), లెవాన్‌ పాంత్సులయ (జార్జియా), నీమన్‌ (అమెరికా)లపై నెగ్గడంతో పాటు ఇస్కందరోవ్‌ (అజర్‌బైజాన్‌), నిజాత్‌ అబసోవ్‌ (అజర్‌బైజాన్‌)లతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు.
– చెస్‌లో గ్రాండ్‌మాస్టర్‌ హోదా రావాలంటే మూడు జీఎం నార్మ్‌లు సాధించడంతో పాటు ఎలో రేటింగ్‌ పాయింట్లు 2500 దాటాలి. ప్రణీత్‌ ఇప్పటికే మూడు జీఎం నార్మ్‌లు సంపాదించినా అతని ఎలో రేటింగ్‌ 2500 దాటలేకపోవడంతో జీఎం హోదా కోసం నిరీక్షించాల్సి వచ్చింది. అయితే బకూ ఓపెన్‌లో ప్రణీత్‌ అద్భుత ప్రదర్శన కనబరిచి తన 2500 ఎలో రేటింగ్‌ను అధిగమించడంతో అతనికి జీఎం హోదా ఖరారైంది. ప్రణీత్‌ తెలంగాణ నుంచి ఆరో జీఎం కావడం విశేషం.
– ప్రణీత్‌ తొలి జీఎం నార్మ్‌ను 2022 మార్చిలో ఫస్ట్‌ సాటర్‌డే టోర్నీలో, రెండో జీఎం నార్మ్‌ను 2022 జూలైలో బీల్‌ ఓపెన్‌ టోర్నీలో, మూడో జీఎం నార్మ్‌ను 2023 ఏప్రిల్‌లో సన్‌వే ఫార్మెన్‌టెరా ఓపెన్‌ టోర్నీలో సాధించాడు.
– ఈ టోర్నీలో తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి ప్రణీత్‌ 6 పాయింట్లతో ఆరో స్థానంలో నిలవగా, తెలంగాణకే చెందిన రాజా రిత్విక్‌ 20వ, హర్ష భరత్‌కోటి 71వ స్థానంతో సరిపెట్టుకున్నారు.
అందుకే ఇండియా టైమ్‌ ఫాలోకాను..
అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్లు ఎక్కువగా యూరప్‌లోనే జరుగుతుంటాయి. కాబట్టి అందులో పాల్గొనడానికి, ఆ పోటీల కోసం సన్నద్ధ మవడానికి యూరప్‌ టైమ్‌నే ఫాలో అవుతుంటా. అందుకే ఇంట్లో అందరూ నిద్రపోతున్నప్పుడు మేల్కొని ఉంటా. వాళ్లు పనులు చేసుకుంటున్నప్పుడు విశ్రాంతి తీసుకుంటా. విదేశీ టోర్నీల్లో ఆడేప్పుడు అక్కడ వాతావరణం, కాలమానంతో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇక్కడున్నప్పుడు కూడా ఇండియా టైమ్‌ ఫాలో కాను. రోజూ 7 – 8 గంటలు సాధన చేస్తాను.
– మోహన్‌

Spread the love