తాతయ్య కల నెరవేరింది

డైరెక్టర్‌ తేజ దర్శకత్వంలో అభిరామ్‌ అరంగేట్రం చేస్తున్న యూత్‌ ఫుల్‌లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘అహింస. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై పి.కిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతికా తివారీ కథానాయిక. జూన్‌ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని చీరాలలో గ్రాండ్‌గా నిర్వహించారు. హీరో రానా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, ‘చీరాలకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మేం ఏం చేసినా, ఎంత దూరం వెళ్ళినా అది మా తాత(రామానాయుడు)గారు వేసిన ఫ్లాట్‌ ఫాం. తేజ ఆయనకి నచ్చిన వ్యక్తులతోనే సినిమా చేస్తారు.
అలాంటి దర్శకుడి చేతిలో మా తమ్మడు లాంచ్‌ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. బాబారు విక్టరీ వెంకటేష్‌ని, నన్ను ఆదరించినట్లే అభిని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ‘నన్ను హీరోగా చూడాలనేది తాత గారి కోరిక. తేజ ఈ సినిమాతో నన్ను లాంచ్‌ చేశారు. ఎంతోమంది హీరోలకు ఆయన లైఫ్‌ ఇచ్చారు. నాకు కూడా ఒక లైఫ్‌ ఇచ్చారు. దాన్ని ఫుల్‌ ఫిల్‌ చేసుకుంటానని చెబుతున్నాను. నిర్మాత కిరణ్‌ ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఆర్పీ పట్నాయక్‌ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. తేజ, ఆర్పీ గారి కాంబో మళ్ళీ రిపీట్‌ అవుతుంది. జూన్‌ 6 తాతగారి బర్త్‌ డే. జూన్‌ 2న ‘అహింస’తో మళ్ళీ నేను పుడుతున్నాను’ అని హీరో అభిరామ్‌ అన్నారు. దర్శకుడు తేజ మాట్లాడుతూ, ‘రామానాయుడు గారు ఉన్నప్పుడు మా మనవడితో సినిమా చేయాలని అడిగారు. చేస్తానని చెప్పాను. అప్పుడు అభిరాం కోసం కథ రెడీ చేశాను. ఈ సినిమా రామానాయుడుగారి కోసం చేశాను. అలాగే మళ్ళీ రానాతో ‘రాక్షస రాజు’ అనే సినిమా తీయబోతున్నా’ అని చెప్పారు.

Spread the love