20 లక్షల ఇండ్లు మంజూరు చేయండి

Grant 20 lakh houses– మెట్రో ఫేజ్‌-2ను జాయింట్‌వెంచర్‌గా చేపట్టాలి
– మూసీకి రూ.10వేల కోట్లు ఇవ్వండి
– హైదరాబాద్‌, వరంగల్‌ డ్రయినేజీ స్కీంలకు కూడా….
– కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వినతి
– పీఎం కుసుమ్‌ కింద లక్ష సోలార్‌ పంపులు కేటాయించండి : డిప్యూటీ సీఎం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎమ్‌ఏవై-అర్బన్‌) రెండో విడతలో రాష్ట్రానికి 20 లక్షల ఇండ్లను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు విజ్ఞప్తి చేశారు. దేశ పట్టణ జనాభాలో 8 శాతం ప్రజలు తెలంగాణలో ఉన్నారని గుర్తుచేశారు. శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్రమంత్రి రాష్ట్రంలో తమ శాఖకు సంబంధించిన పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. దీనిలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అవసరాలను సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. పీఎమ్‌ఏవై రెండో దశలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సమాచారం, ప్రణాళికతో సిద్ధంగా ఉన్నందున 20 లక్షల ఇండ్లు కేటాయించాలని కోరారు. దేశంలో మహానగరాలైన ఢిల్లీ, చెన్నై, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లో మెట్రోరైల్‌ కనెక్టివిటీ తక్కువగా ఉన్నదనీ, అందువల్ల మెట్రో ఫేజ్‌-2 కింద ఆరు కారిడార్లను గుర్తించామనీ, దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టుగా గుర్తించాలని కోరారు. ఈ సందర్భంగా కారిడార్ల వివరాలను కేంద్రమంత్రికి వివరించారు. దీనికి సంబంధించిన డీపీఆర్‌లు కూడా పూర్తయ్యాయనీ, రూ.24,269 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశామన్నారు. అలాగే మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌కు చేయూతనివ్వాలనీ, మూసీలో మురుగునీరు చేరకుండా నదికి ఇరువైపులా 55 కిలోమీటర్ల (మొత్తంగా 110 కి.మీ.) కాలువలు, బాక్స్‌ డ్రెయిన్లు, ఎస్టీపీల నిర్మాణానికి రూ.10వేల కోట్ల నిధులు ఇవ్వాలని కోరారు. అలాగే హైదరాబాద్‌ నగరంతో పాటు సమీపంలోని 27 పట్టణ పురపాలక సంస్థల పరిధిలో మురుగు నీటి నెట్‌వర్క్‌ నిర్మాణానికి రూ.17,212 కోట్లతో సమగ్ర మురుగునీటి మేజర్‌ ప్లాన్‌ (సీఎస్‌ఎంపీ) తయారు చేశామనీ, అమృత్‌ సిటీ ప్రాజెక్టుల్లో భాగంగా వాటికి కూడా ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌ సమగ్రాభివృద్ధి కోసం మాస్టర్‌ప్లాన్‌ను నోటిఫై చేశామనీ, ఇక్కడ రూ.41.70 కోట్లతో భూగర్భ డ్రయినేజీ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వాలని కోరారు.
సమీక్షా సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్‌ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ పీఎమ్‌ కుసుమ్‌ ప్రాజెక్ట్‌ కింద రాష్ట్రానికి లక్ష సౌర పంపుసెట్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. గిరిజనుల సాగుభూములకు ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. అలాగే పీఎం కుసుమ్‌ -సీఎఫ్‌ఎల్‌ఎస్‌ కాంపొనెంట్‌ కింద 2,500 మెగావాట్లను కేటాయించాలని కూడా కోరారు. రూ.488 కోట్ల అంచనా వ్యయంతో తొమ్మిది ప్రాజెక్టులకు సంబంధించి విద్యుత్‌ సరఫరా, నెట్‌వర్క్‌ బలోపేతం కోసం కేంద్రానికి నివేదికలు పంపామనీ, వాటికి ఆమోదం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే రీవాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టర్‌ స్కీం (ఆర్డీఎస్‌ఎస్‌)లో తెలంగాణ డిస్కమ్‌లను చేర్చాలన్నారు. రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ), గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) ఇచ్చిన రుణాల వడ్డీ రేట్లను తగ్గించాలని కోరారు. రాష్ట్రంలో నూతన పునరుత్పాదక ఇంథన కేంద్రాల నిర్మానానికి రెండేండ్లు సమాయం పడుతుందనీ, అందువల్ల ఆర్‌పీపీఓ లక్ష్యాలు చేరలేదంటూ విధించే జరిమానాలను మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్‌, ప్రజాసంబంధాలు) హర్కార వేణుగోపాల్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితోపాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సీఎంకు కేంద్రమంత్రి అభినందనలు
దావోస్‌ ప్రపంచ వాణిజ్య సదస్సులో రాష్ట్రానికి రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ అభినందించారు. దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చాలని ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రాన్ని 1 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకోవడం సంతోషంగా ఉందన్నారు. దానికోసం కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

Spread the love