సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ట్రామా సెంటర్ల ఏర్పాటుకు నిధులు మంజూరు

నవతెలంగాణ – సూర్యాపేట: రోడ్డు ప్రమాద బాధితులకు సత్వరమే వైద్యసహాయం అందించేందుకు జాతీయ రహదారులపై ప్రభుత్వం మరో రెండు ట్రామా సెంటర్ల ఏర్పాట్లకు నిర్ణయించింది. సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ట్రామా సెంటర్ల ఏర్పాట్ల కోసం రూ.47 కోట్ల 50 లక్షలను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సూర్యాపేట కు రూ.23 కోట్ల 75 లక్షలు, నల్లగొండకు రూ. 23.75 కోట్లను మంజూరు చేసింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేటలో, హైదరాబాద్-అద్దంకి జాతీయ రహదారిపై ఉన్న నల్లగొండ జిల్లా కేంద్రాల్లోని మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు. ప్రమాద బాధితులకు అత్యవసర చికిత్సలకు సరిపడా ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. రెండు మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్న వైద్య విద్యార్థులు ఉండడంతో క్షతగాత్రులకు వైద్యం సులువుగా అందించేందుకు ప్రభుత్వం ట్రామా సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై రెండు జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రామా కేంద్రాల ఏర్పాటుకు కృషి చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love