ఎల్‌ఐసీ ఏజెంట్లకు గ్రాట్యూటీ పెంపు

Gratuity increase for LIC agents– ఉద్యోగులకు 30శాతం కుటుంబ పెన్షన్‌
– ఆర్థిక శాఖ నిర్ణయం
న్యూఢిల్లీ : దిగ్గజ బీమా సంస్థ లైఫ్‌ ఇన్య్సూరెన్స్‌ కంపెనీ (ఎల్‌ఐసీ)లో పని చేస్తున్న ఏజెంట్లకు ప్రస్తుతం అందిస్తున్న గ్రాట్యూటీ మొత్తాన్ని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ఎల్‌ఐసి ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం అందరికీ ఒకే తరహాలో 30 శాతం ఫ్యామిలీ పెన్షన్‌ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. దీంతో 13 లక్షల మంది ఏజెంట్లకు, లక్ష మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుందని ఆర్థిక శాఖ పేర్కొంది. తిరిగి అపాయింట్‌ అయిన ఏజెంట్లకూ రెన్యువల్‌ కమీషన్‌ పొందేందుకు అర్హత కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఏజెంట్లకు టర్మ్‌ ఇన్స్యూరెన్స్‌ కవరేజీని ప్రస్తుతమున్న రూ.3,000-10వేల మొత్తాన్ని ఇకపై రూ.25000-రూ.1.50 లక్షలకు పెంచుతున్నట్టు స్పష్టం చేసింది. దీంతో అకాల మరణం పొందిన ఏజెంట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. ఎల్‌ఐసీ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి రూ.1831.09 కోట్ల డివిడెండ్‌ను ప్రకటించింది. 1956లో రూ.5 కోట్ల మూలధనంతో సంస్థ ప్రస్థానాన్ని ప్రారంభించింది. 2023 మార్చి ముగింపు నాటికి రూ.45,50,571.73 కోట్ల ఆస్తులకు చేరింది. గడిచిన రెండు దశాబ్దాల్లో అనేక ప్రయివేటు రంగ బీమా సంస్థలు వచ్చినప్పటికీ.. ఇప్పటికీ ఎల్‌ఐసీనే మార్కెట్‌ లీడర్‌గా ఉంది.

Spread the love