ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసే గ్రే

అరవింద్‌ కృష్ణ, అలీ రెజా, ప్రతాప్‌ పోతన్‌, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గ్రే’. ద స్పై హూ లవ్డ్‌ మి అనేది ట్యాగ్‌లైన్‌. రాజ్‌ మదిరాజు దర్శకత్వం వహించారు. అద్వితీయ మూవీస్‌ ప్రై.లి పతాకంపై ప్రొడక్షన్‌ నెం.1గా కిరణ్‌ కాళ్లకూరి నిర్మించారు.
పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌కు ఎంపికైన ఈ చిత్రం నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చిత్ర దర్శకుడు రాజ్‌ మదిరాజు మాట్లాడుతూ, ‘కొన్నేళ్ల క్రితం మనదేశంలో రెండేళ్ల వ్యవధిలో దాదాపు 12మంది న్యూక్లియర్‌ సైంటిస్టులు కనపడకుండా పోయారు. ఇలా గతంలో కూడా చాలా సార్లు జరిగింది.
వీటన్నింటికి కారణం ఏంటంటే..ఫారెన్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సిస్‌ వారు చాలా జాగ్రత్తగా వలపన్ని చేసిన ఆపరేషన్స్‌. అందులో నుండి పుట్టిన ఐడియానే గ్రే మూవీ. దాదాపు 40 ఏళ్ల తర్వాత బ్లాక్‌ అండ్‌ వైట్‌లో వస్తున్న చిత్రమిది. దానికోసం అన్ని అంశాలను రీసెర్చ్‌ చేశాం. ప్రతి ఆలోచన వెనుక మన ఆలోచనలకు కూడా అందని కొన్ని వింతైన ఎక్స్‌ప్రెషన్స్‌ ఉంటాయి. అదే ఈ స్పై డ్రామా. ఈ చిత్రాన్ని పీవీఆర్‌ పిక్చర్స్‌ వారు రిలీజ్‌ చేయడం చాలా హ్యాపీగా ఉంది’ అని తెలిపారు. ‘దర్శకుడు రాజ్‌ చాలా రీసెర్చ్‌ చేసి ఈ సినిమా రూపొందించారు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సినిమాల కోసమే ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా మీ అందరి అంచనాలను అందుకోవాలని కోరుకుంటున్నాను’ అని హీరో అరవింద్‌ కృష్ణ చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ, ‘ఇదొక పర్‌ఫెక్ట్‌ స్పై మూవీ. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా ఇది’ అని తెలిపారు.

Spread the love