మహా విజయం

– అన్నదాతల డిమాండ్లకు ఓకే
– ముగిసిన ఏఐకేఎస్‌ లాంగ్‌ మార్చ్‌
– ఆందోళనలు వాయిదా : ప్రకటించిన రైతు నాయకుడు జెపి గవిట్‌
– మోసం చేస్తే పెద్ద సంఖ్యలో తిరిగి వస్తామన్న రైతులురైతుల ఆందోళనతో దిగొచ్చిన మహారాష్ట్ర సర్కార్‌

మహారాష్ట్రలో ఏఐకేఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన గిరిజన రైతుల లాంగ్‌ మార్చ్‌కు రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఈనెల 12న నాసిక్‌ నుంచి ముంబయికి అన్న దాతలు చేపట్టిన 200 కిలోమీటర్ల సుదీర్ఘ యాత్రకు ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి వారి డిమాండ్లకు అంగీకరిం చింది. ఎండ, వాన, రాత్రి, పగలును లెక్క చేయ కుండా అనేక ఇబ్బందులను ఎదు ర్కొంటూ వేలాది మంది రైతులు పాల్గొన్న ఈ లాంగ్‌ మార్చ్‌ ‘మహా’ విజయం సాధించిడం పట్ల రైతులు, రైతు నాయ కులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. డిమాండ్ల విషయంలో ప్రభుత్వం మోసగిస్తే భారీ సంఖ్యలో తిరిగి వస్తామని హెచ్చరించారు.
ముంబయి : మహారాష్ట్రలో రైతులు గొప్ప విజయాన్ని సాధించారు. డిమాండ్ల కోసం ఆలిండియా కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) ఆధ్వర్యంలో జరిపిన లాంగ్‌ మార్చ్‌తో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది. అన్నదాతల డిమాండ్లకు ఆమోదం తెలిపింది. దీంతో ఏఐకేఎస్‌ నాయకులు లాంగ్‌ మార్చ్‌ను ముగించారు. పోరాటాన్ని వాయిదా వేశారు. మార్చ్‌ ఆగిపోయిన వాసింద్‌లోని ఈద్గా మైదానంలో జరిగిన బహిరంగ సమావేశంలో రైతు నాయకుడు జె.పి గవిత్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. అన్నదాతలు చేపట్టిన లాంగ్‌ మార్చ్‌లో ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురయ్యాయి. రైతులు అనేక బాధలు, ఇబ్బందులను ఎదుర్కొని మరీ ముందుకెళ్లారు. నాసిక్‌ నుంచి ముంబయికి తమ యాత్రను సాగించారు. ఈ
పోరాటంలో నాసిక్‌లోని దిండోరీ గ్రామ రైతు అంబో జాదవ్‌ (58) ప్రాణాలు కోల్పోయారు కూడా. అయితే, ఈ విజయాన్ని రైతు నాయకులు అంబో జాదవ్‌కు అంకితం చేశారు. జాదవ్‌ అమరుడయ్యాడని కొనియాడారు.
ప్రభుత్వం మన అన్ని డిమాండ్లకు అంగీకరించిందని బహిరంగ సమావేశంలో గవిత్‌ తెలిపారు. కొన్ని ప్రభుత్వ సంబంధ విషయాల్లో ఒక కమిటీ ఏర్పాటైందన్నారు. ఇలా ఏర్పాటైన కమిటీ రైతుల డిమాండ్లను ఎలా నెరవేర్చాలన్నదానిపై ఒక నిర్ధిష్ట కాలపరిమితిలో నివేదికను అందించనున్న దన్నారు. గతంలో ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నించారనీ.. అయితే లాంగ్‌ మార్చ్‌కు గొప్ప ప్రజా బలం చేకూరడంతో ప్రభుత్వం రైతులతో మాట్లాడక తప్పని పరిస్థితిని వచ్చిందని ఆయన చెప్పారు. ఏఐకేఎస్‌పై రైతులకు ఎనలేని నమ్మకం ఉన్నదని విజయం అనంతరం రైతు నాయకుడు జితేంద్ర చోప్డే తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ” మేము విజయం తర్వాత ఇక్కడ నుంచి కదులుతున్నాము. ఒకవేళ ప్రభుత్వం మమ్మల్ని మోసగిస్తే ఆరు నెలల తర్వాత ఇంత కంటే పెద్ద సంఖ్యలో తిరిగి వస్తాము” అని జితేంద్ర అన్నారు.
సుదీర్ఘ పోరాటానికి సిద్ధమై
ఈనెల 12న వేలాది మంది రైతులతో నాసిక్‌ నుంచి సుదీర్ఘ పాదయాత్ర ముంబయికి బయలు దేరింది. దాదాపు 200 కిలోమీటర్ల దూరాన్ని కవర్‌ చేసే ఈ లాంగ్‌మార్చ్‌లో ఎర్రజెండాలను చేతబట్టుకొని వేలాది మంది ఏఐకేఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మద్దతుదారులు, కార్మికులు, విద్యార్థి సంఘాల నాయకులు కదిలారు. అయితే ఈనెల 16న వాసింద్‌లో ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో ఈద్గా గ్రౌండ్‌లో నిరసనకారులు ఉన్నారు. నాసిక్‌-ముంబయి జాతీయ రహదారిపై రైతులు తాత్కాలికంగా ఏర్పాట్లను చేసుకున్నారు. భూమి హక్కును పొందడం కోసం రెండు తరాలు పోరాటాన్ని సాగించి ప్రాణాలు వదిలారని సుక్రమ్‌ పవార్‌ అనే రైతు వాపోయాడు. ఇప్పుడు నా పిల్లలు కూడా అలా కాకూడదనీ, పోరాటం ముఖ్యమని తెలిపాడు. సుక్రమ్‌ పవార్‌ లాగే వేలాది మంది గిరిజన రైతులు కూడా తాము సాగు చేసుకుంటున్న అటవీ భూమిని తమకే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.
ఢిల్లీ ఆందోళనలు గుర్తు చేసేలా..!
ఈద్గా మైదానంలో రైతులు చేసుకున్న ఏర్పాట్లు వారి పోరాటంలో వారికి ఉన్న నిబద్ధతకు అద్దం పట్టింది. మోడీ సర్కారు తీసుకొచ్చిన వివాదాస్పద సాగు చట్టాలపై దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతన్నలు చేసిన ఆందోళనను ఇది గుర్తు చేసింది. ఆహారధాన్యాలు, కూరగాయలు, తృణధాన్యాలు, వంటపాత్రలు, వంట చెరుకు ఇలా రోజువారి అవసరాలకు కావాల్సిన సామాన్లను వారు తమ వెంట తెచ్చుకున్నారు. రైతులు తీసుకొచ్చుకున్న టెంట్లు, వాహనాలు వేలాది మంది రైతులకు ఆశ్రయం కల్పించలేకపోయాయి. దీంతో అనేక మంది బయట పడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే, తీవ్ర ఎండలనూ వారు లెక్క చేయకుండా ముందుకు సాగారు. వాసింద్‌కు చేరుకున్న తర్వాత వర్షాలు రావడంతో ఈద్గా మైదానమంతా నీటితో నిండిపోయింది. అలాగే, విద్యుత్‌ సౌకర్యమూ లేదు.
అసెంబ్లీలో సీఎం ప్రకటన
రైతుల డిమాండ్ల విషయంలో ప్రభుత్వ సమ్మతి గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడారు. అటవీ భూములు, ఆలయ ట్రస్టులు, రైతులకు బీడు భూముల బదలాయింపుతో పాటు 14 అంశాలపై రైతు ప్రతినిధులతో చర్చించినట్టు తెలిపారు. రైతులు తమ ఉద్యమాన్ని ముగించాలని కోరారు. తీసుకున్న నిర్ణయాలు వెంటనే అమలవుతాయన్నారు. నాలుగు ఎకరాల వరకు రైతుల ఆధీనంలో ఉన్న అటవీ భూమిపై క్యాబినేట్‌ ఉప కమిటీ ఏర్పాటవుతుందనీ, ఒక నెలలో నివేదికను రూపొందించడమే కాకుండా అటవీ హక్కుల చట్టం కింద పెండింగ్‌ క్లెయిమ్‌లను పర్యవేక్షిస్తుందన్నారు. ఈ కమిటీలో మాజీ ఎమ్మెల్యే, రైతు నాయకుడు గవిత్‌, సీపీఐ(ఎం) సిట్టింగ్‌ ఎమ్మెల్యే వినోద్‌ నికోలేలు భాగం కానున్నారు.
వచ్చే నెల 5న ఢిల్లీలో ఆందోళన
రైతన్నల లాంగ్‌ మార్చ్‌, ప్రభుత్వంతో జరిగిన చర్చలలో కార్మిక నాయకులు, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు బి.ఎల్‌ కరాడ్‌ సైతం పాల్గొన్నారు. రైతుల డిమాండ్ల తో పాటు కార్మికులకు సంబంధించిన అంశా ల్లోనూ ప్రభుత్వం సానుకూలంగా చర్యలు తీసు కోనున్నదని కరాడ్‌ అన్నారు. అయితే, ప్రభుత్వం ఆమోదించినవి రాష్ట్రస్థాయి డిమాండ్లేననీ, ఇంతకంటే పెద్ద సమస్యలు ఇంకా ఉన్నాయని తెలిపారు. తమ సమస్యలపై వచ్చే నెల 5న రైతులు, కార్మికులు దేశ రాజధానిని చుట్టుముడుతారని కరాడ్‌ అన్నారు. మహారాష్ట్ర నుంచి దాదాపు 10 వేల నుంచి 15 వేల మంది రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు ఇందులో పాల్గొంటారని చెప్పారు.
పౌర సంఘం నాయకులు.
కార్మికులు, విద్యార్థుల నుంచి మద్దతు
రైతన్నలు చేపట్టిన సుదీర్ఘ మార్చ్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు, సహకారం లభించింది. యాత్ర సమయంలో పలువురు పౌర సంఘం నాయకులు సహాయం చేశారు. వందలాది మంది విద్యార్థులు కూడా ఈ చారిత్రక పోరాటంలో భాగమై అన్న దాతలకు తోడ్పాటునందించారు. రైతులకు సహాయం అందించేందుకే తన తోటి విద్యార్థి నాయకులతో కలిసి వారి పోరాటంలో భాగమైనట్టు మహారాష్ట్ర యూనిట్‌ ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు రోహిత్‌ తెలిపాడు. రైతు మహా పోరాటంలో పలువురు సీఐటీయూ నాయకులూ పాల్గొన్నారు. వచ్చే నెల 5న ఢిల్లీలో లక్షలాది మంది రైతులు, కార్మికులతో ఆందోళన జరగనున్నదనీ, మహారాష్ట్ర ప్రభుత్వం తలవంచినట్టే కేంద్రంలో మోడీ సర్కారు కూడా దిగొచ్చేలా చేస్తామని రైతులు, రైతు నాయకులు తెలిపారు.

Spread the love