హరిత క్షోభ

– ప్రకృతి సంపదపై గొడ్డలి వేటు
– విద్యుత్‌ శాఖ ఇష్టారాజ్యం
– నేల కూలుతున్న మహావక్షాలు
– కొమ్మలు నరికివేయడంతో మోడుగా మారిన చెట్టు
– విద్యుత్‌ తీగలకు తగులుతున్నాయంటూ నరికివేత
– ఏటా మూడు నాలుగుసార్లు ఇదే తంతు
– నిరుపయోగమవుతున్న ఉపాధిహామీ నిధులు
‘హుదూద్‌’ విపత్తు వేళా మేం ఇంతలా బాధపడలేదు. ప్రకృతి విలయ తాండవం చేసిన సమయంలో కూకటి వేళ్లతో సహా నేలకొరిగాం. కొన్నాళ్లకే మళ్లీ సగర్వంగా లేచి నిలబడ్డాం. కానీ.. ఇప్పుడు మమ్మల్ని ఖండ ఖండాలు చేస్తున్న తీరుతో తీవ్రంగా కుంగిపోతున్నాం. వసంత రుతువులో చిగురించాం.. గ్రీష్మంలో చల్లదనాన్ని పంచాం. అదే సమయంలో పచ్చని చెట్లు- ప్రగతికి మెట్లు, హరిత తెలంగాణ అన్న నినాదాలు వినిపిస్తుంటే.. మాపై మనుషులకు గౌరవం పెరిగిందని సంబర పడ్డాం. లేలేత చిగుళ్లన్నీ ఇప్పుడిప్పుడే ఆకులుగా మారుతున్న తరుణంలో పచ్చదనంతో పరవళ్లు తొక్కుతూ.. పది మందికి ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచుదామనుకున్నాం. ఇంతలోనే విద్యుత్‌ తీగలకు అడ్డుతగులుతున్నామన్న సాకుతో.. పెంచిన చేతులతోనే మా అంగాంగాలను తెగ నరుకుతున్నారు. ఆక్సిజన్‌తో పాటు నీడనిస్తున్న మమ్మల్ని మోడుల్లా మార్చేస్తున్నారు. మళ్లీ చిగురించి నిలదొక్కుకుంటున్నాం. ఆ ఆనందాన్నీ ఎంతో కాలం అనుభవించనీయకుండా మళ్లీ మళ్లీ మోడులుగా మార్చేస్తున్నారు. ప్రతి రెండు మూడు నెలలకోసారి విద్యుత్‌ సిబ్బంది వికృత చేష్టలకు బలైపోతున్నాం. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే మేము చేసిన పాపమా..? పర్యావరణాన్ని పరిరక్షించడమే మా పాలిట శాపమా’..? జాతీయ రహదారితో పాటు వివిధ ప్రాంతాల్లో ఏండ్ల వయసున్న వృక్షాల విలాపమిదీ!
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
దశాబ్దాలుగా నీడనిస్తున్న చెట్లను నరకొద్దని స్థానికులు వారిస్తున్నా విద్యుత్‌ సిబ్బంది మెయింటెనెన్స్‌ పేరుతో అడ్డగోలుగా నరికేస్తున్నారు. హరిత తెలంగాణను నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తున్నా.. తమకేమీ పట్టదన్నట్టుగా విద్యుత్‌ శాఖ ఇష్టం వచ్చినట్టు చెట్లను నరికేస్తున్నారు. ఆశాఖ అధికారులు ఒక్క మొక్క నాటిందీ లేదు. ఇతర శాఖలు నాటిని చెట్లను తెగనరుకుతున్నారు.
వాల్టా చట్టం ఏం చెబుతోంది..?
పర్యావరణ పరిరక్షణకు 2002లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాల్టా చట్టంపై అదే ప్రభుత్వ సంస్థలు గొడ్డలివేటు వేస్తున్నాయి. వాల్టా చట్టం సెక్షన్‌-2 ప్రకారం నగరాలు, గ్రామాలు, పట్టణాల్లో స్థానిక సంస్థలు మొక్కలు నాటాలి. ఉన్న వాటిని సంరక్షించాలి. కానీ ఆ సెక్షన్లను కాలరాస్తున్నారు. దశాబ్దాలుగా నీడనిస్తూ.. పర్యావరణాన్ని కాపాడుతున్న భారీ వృక్షాలను నరికేస్తున్నారు. విద్యుత్‌, టెలికాం, రహదారులు-భవనాలు వంటి శాఖలు విధి నిర్వహణ పేరుతో చెట్లు, వాటి కొమ్మలను ఇష్టారాజ్యంగా నరికేయకూడదు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకైనా అనుమతి తప్పనిసరంటూ వాల్టా చట్టం చెబుతోంది. ఒక చెట్టును కొట్టాల్సి వస్తే.. దానికి ప్రత్యామ్నాయంగా రెండు మొక్కలు నాటాల్సి ఉంది. వాటి సంరక్షణకు అవసరమైన ఖర్చును సంబంధిత శాఖలు ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఎవరికి నచ్చినట్టు వారు పర్యావరణాన్ని విచ్ఛిన్నం చేసేస్తున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ, గ్రామీణ రోడ్ల పక్కన ఏపుగా పెరిగిన చెట్లను నరికేశారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రం నుంచి రాయపోల్‌ వెళ్లే రహదారిలో ఉపాధిహామీ ద్వారా లక్షలాది రూపాయలు వెచ్చించి నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. ఆ చెట్లను విద్యుత్తు అధికారులు నరికేస్తున్నారు. ఇప్పటికైనా సమన్వయంతో మెయింటెనెన్స్‌ పనులు చేపడితే.. పర్యావరణానికి విఘాతం కలగకుండా నిర్వహించవచ్చని పర్యావరణ వేతలు కోరుతున్నారు.
తరచూ ఇదే తంతు…
చెట్లు పెరిగి.. వాటి కొమ్మలు విద్యుత్‌ తీగలను తాకితే ప్రమాదాలు సంభవిస్తాయనే ఉద్దేశంతో ఏటా విద్యుత్‌ అధికారులు మెయింటెనెన్స్‌ పనులు చేపడుతున్నారు. కరెంటు తీగలకు తగులుతున్న చెట్ల కొమ్మలను కత్తిరించాలి. వాస్తవంగా అయితే.. కరెంట్‌ తీగలకు 6 నుంచి 10 అడుగుల దిగువ వరకు కొమ్మలను నరకాలి. కానీ ఇబ్రహీంపట్నం విద్యుత్తు అధికారులు మాత్రం నేల నుంచి 3-5 అడుగుల వరకు ఉంచి.. మిగిలిన చెట్టు కొమ్మలన్నింటినీ నరికేస్తున్నారు. దీంతో ఏపుగా పెరిగి పచ్చదనంతో కళకళలాడిన చెట్లన్నీ మోడులవుతున్నాయి.
గుండె తరుక్కుపోతోంది
ప్రభుత్వం పచ్చదనం పెంపొందించేందుకు ఉపాధిహామీ ద్వారా నాటిని మొక్కను ప్రాణంగా పెంచుతున్నాం. వేసవిలో ఒక్క మొక్క కూడా ఎండిపోవద్దని ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తుంది. అయితే మెయింటెనెన్స్‌ పేరుతో ఆ చెట్లను విద్యుత్తు అధికారులు ఛిద్రం చేస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఇటు విద్యుత్‌, ఇతర శాఖలు సమన్వయంతో పని చేస్తే చెట్లను రక్షించుకోవచ్చు. ఇదే విషయమై ఎంపీడీఓ వెంకటమ్మకు ఫిర్యాదు చేశారు.
దొండ రమణా రెడ్డి, రాయపొల్‌

Spread the love