– రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలి :పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 19న ప్రత్యేక హరితోత్సవం నిర్వహిస్తున్నట్టు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. సచివాలయంలో హరితోత్సవం పోస్టర్‌ను అటవీ శాఖ అధికారులతో కలిసి సోమవారం మంత్రి ఆవిష్కరించారు. తొమ్మిదేండ్లుగా హరితహారంలో భాగంగా అమలు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు, విజయాలను వివరించే రెండు పోస్టర్లను అటవీ శాఖ తయారు చేసింది. కోట్లాది మొక్కలు నాటడం, రహదారి వనాలు, పల్లె ప్రకృతి వనాలు, అర్బన్ పార్కుల ఏర్పాటు, అటవీ పునరుద్ధరణలో భాగంగా అడవుల పెంపకం కోసం చేపట్టిన కార్యక్రమాలను పోస్టర్లలో పొందుపర్చారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రతి గ్రామం, పట్టణం, ప్రభుత్వ కార్యాలయాల్లో హరితహారం విజయాలను ప్రదర్శించేందుకు అటవీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వివరించారు. ఈనెల 19న హరితోత్సవం సందర్భంగానే తొమ్మిదో విడత హరితహారం ప్రారంభమౌతుందన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటు ఎంత ప్రత్యేకమో, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అంతే విశిష్టతను కలిగి ఉన్నాయని వివరించారు. 33 శాతం పచ్చదనం సాధన కోసం అమలు చేస్తున్న తెలంగాణకు హరిత హారం జాతీయ స్థాయి ప్రశంసలు అందుకుంటున్నదని చెప్పారు. ఈ పథకా నికి దక్కుతున్న ప్రతి అవార్డు, గుర్తింపులో అందరి భాగస్వామ్య ముందని అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చదనం పెంపున కు అందరూ పునరంకితం కావాలని మంత్రి పిలుపునిచ్చారు.