– ఆయనపై బీజేపీ ఆపరేషన్
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు మళ్లీ చిక్కులు ఎదురయ్యాయి. బుధవారం నాడు ఇటు కేజ్రీవాల్ నామినేషన్ పత్రాలు సమర్పించగా..అటు నగదు అక్రమ చలామణితో ముడిపడిన మద్యం కుంభకోణం కేసులో ఆయన ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు కేంద్రం అనుమతులిచ్చింది. ప్రజాప్రతినిధుల్ని విచారించాలంటే ఈడీ ముందస్తు అనుమతి పొందాలని సుప్రీంకోర్టు గత నవంబర్‌లో ఆదేశించింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ విచారణకు అనుమతి కోరుతూ గత నెల లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఈడీ లేఖ రాసింది. దీనికి ఆయన ఆమోదం తెలిపారు. ఈవిషయాన్ని దర్యాప్తు సంస్థ కేంద్ర హౌంశాఖ దృష్టికి తీసుకెళ్లింది. అనంతరం కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి కేంద్రం గ్రీన్ సిగల్ ఇచ్చింది. దీంతో త్వరలోనే మాజీ సీఎంను దర్యాప్తు అధికారులు విచారించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఢిల్లీలో మరికొన్ని రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. నూతన మద్యం విధానంలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై 2024 మార్చి 21న అప్పటి దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. అనంతరం సీబీఐ కూడా కేసు నమోదు చేసి గతేడాది జూన్‌లో కస్టడీలోకి తీసుకుంది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. గత సెప్టెంబరులో బెయిల్ మంజూరైంది. జైలు నుంచి బయటకు వచ్చిన కొన్ని రోజులకు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.70 శాసనసభ స్థానాలు ఉన్న ఢిల్లీకి ఫిబ్రవరి 5న ఒకేవిడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.