ఖమ్మంలో తమిళనాడు ఎక్స్‌ప్రెస్ కు గ్రీన్ సిగ్నల్

నవతెలంగాణ-ఖమ్మం: ఖమ్మంలో తమిళనాడు ఎక్స్‌ప్రెస్‏ను నిలిపడానికి రైల్వేశాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటి వరకు తమిళనాడు వెళ్లడానికి ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఇటీవలె కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌కు ఖమ్మంలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ హాల్టింగ్‌కు విన్నవించారు. ఈ నేపథ్యంలో స్పందించిన రైల్వే శాఖ ఖమ్మంలో తమిళనాడు ఎక్స్‌ప్రెస్‏ను నిలపడానికి ఉత్తర్వులు వెల్లడించినట్లు తెలిసింది. ఇప్పటివరకు ఈ రైలు విజయవాడ, వరంగల్‌లో మాత్రమే హాల్టింగ్‌ ఉంది. ఈ రైలు మద్రాస్‌ నుంచి న్యూఢిల్లీ వెళ్లేందుకు (12621) ప్రతి రోజు తెల్లవారుఝామున 5.24 నిమిషాలకు చేరుకుని నిమిషం పాటు ఉంటుంది. ఢిల్లీ నుంచి మద్రాస్‏కు వెళ్లడానికి (12622) ప్రతి రోజు రాత్రి 8.54 నిమిషాలకు ఖమ్మం చేరుకుంటుంది. ఈ రైలు హాల్టింగ్‌తో ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రానైట్‌, ఇతర పరిశ్రమల్లో పనిచేస్తున్న తమిళనాడు ప్రాంత కార్మికులకు అనుకూలంగా ఉంటుందని అంటున్నారు.

Spread the love