– స్వచ్ఛందంగా ముందుకొస్తే రాయితీలు : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన మోటారు వాహనాల చట్టంలోని వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇచ్చింది. ఈ మేరకు విధివిధానాలను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌తో కలిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని సచివాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవన కాలం ముగిసిన వాహనాలకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా వాటిని దశలవారీగా తొలగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. కాలం తీరిన ప్రయివేట్ వాహనాల కోసం నిర్దేశించిన పాలసీ ప్రకారం 15 ఏండ్లు దాటిన తర్వాత స్వచ్చంధంగా స్క్రాపింగ్ చేసే వారికి ఎంవీ టాక్స్ రాయితీతో పాటు, కొత్త వాహనం కొనుగోలు సందర్భంగా పెనాల్టీలను రద్దు చేయనున్నట్టు వెల్లడించారు. ఇందుకు ఎలాంటి నిర్భందం లేదనీ, వాహనదారులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ఈ పథకం కింద రాబోయే రెండేండ్లు రాయితీలు వర్తిస్తాయని తెలిపారు. ప్రభుత్వ వాహనాలకు సంబంధించి 1989 కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం ఈ యాక్షన్ నిర్వహించి దశలవారీగా డిస్పోజ్ చేస్తామని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో రూ.296 కోట్లతో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. మొదటిదశలో ఉమ్మడి జిల్లాల్లో 15, హైదరాబాద్‌లో మాత్రం అదనంగా నాలుగు స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. కాలుష్యం, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సారధి పథకం, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ఏడాది లోపు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయన్నుట్టు వివరించారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఇలంబత్రి మాట్లాడుతూ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని, అందులో బెస్ట్ పాలసీని తీసుకున్నట్టు తెలిపారు. పాత బకాయిలున్న వాహనం స్క్రాప్‌కు తీసుకెళ్తే వన్‌టైం సెటిల్మెంట్ చేసేలా అవకాశం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. కాలం చెల్లిన ప్రభుత్వ వాహనాలను సెక్షన్ 52 ప్రకారం రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేయడం లేదన్నారు. స్క్రాపింగ్, రాయితీలు మొదలగునవి భారతీయ మోటార్ వాహన చట్టం ప్రకారం అమలు చేస్తున్నట్టు చెప్పారు. రూ.లక్షలోపు ద్విచక్రవాహనాలకు రూ. వెయ్యి, రూ.2 లక్షల లోపు వాటికి రూ.2 వేలు, రూ.3 లక్షల లోపు వాటికి రూ.3వేల రాయితీ అందించనున్నట్టు తెలిపారు. అలాగే నాలుగు చక్రాల వాహనాలకు కనిష్టంగా రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు స్క్రాపింగ్ రాయితీ అందిస్తామని చెప్పారు. ఎనిమిదేండ్లు దాటిన ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు ఏటా త్రైమాసికం పన్నుపై 10 శాతం రాయితీ ఇస్తామన్నారు. ప్రయివేట్ వాహనదారులు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.