గ్రీష్మ తాపాక్షరం

తూర్పుకు బయలుదేరిన దేహపు
నుదురుపై వాలిన వెచ్చని గాలి
స్వేద బిందువులై రాలటంతో
ఎండా కాలపు స్పర్శలు మొదలయ్యాయి

నా కాయంపై ఆచ్ఛాదనలన్నీ
నాకు బరువై పోతున్నాయి
దిగంబరం కాలేక కప్పుకున్న వస్త్రపు పోగుల్ని
వొలిచి పక్కన పెట్టాలనే ఆతృత
ఏ నూలుపోగూ లేని వొంటిని
స్వాగతిస్తోంది మనసు

చీకట్లను చీల్చుకుంటూ…
ఉదయ భానుడు సప్తశ్వరథ మారుడై వేగంగా
వస్తున్నట్టు ఆకాశపు దార్లు
వెలుతురు బాకుల్ని విసురుతున్నాయి

వేకువ కువకువ సంగీతం
వెచ్చగా పచ్చని పైర్లను వాటేసుకుంటూ
సూర్యరశ్మి రూపాంతరమై
నిలువెల్లా నిటారుగా పొడుస్తోంది

ఇనుమును కరిగిస్తున్న భగ భగల కొలిమిలా
భగ్గున మండుతోంది ఎండ
ఎవరికీ ఎవరూ పట్టనట్టు
మనుషులంతా రోడ్లపై అడుగుల వేగం పెంచారు
వాహనాలూ మెదళ్ళలాగే వేడెక్కుతున్నాయి

రుతువులన్నీ ఒకేలా వుండవు
అని చెప్పేందుకే గ్రీష్మం కోపతాపాలతో
చిర్రు బుర్రు లాడుతున్నట్టుంది

తడి ఆరిపోయిన నాలుకలు
ఎడారి ఇసుక మేటలను స్మరిస్తూ..
అడుగడుగునా చలివేంద్రాలుంటే
బాగుండేదని ఘోషిస్తున్నట్టు పొడిపొడి నిట్టూర్పులు

లోపలి బయటి మంటల గురించి
ఎంత చెప్పుకున్నా..
ఎండాకాలం వర్ణనాతీతం
అది శ్రమ జీవుల కలికాలపు దుఖం

సుఖాల సంగతి ఏమో గానీ…
చెమట చుక్కలతో తడిసి
తీరని హక్కులతో వెరసి
ఒళ్లంతా ఉప్పు చారల్ని కప్పుకున్న
అభాగ్యుల మీద
ఈ క్షణమే ఇప్పుడే వున్నపళంగా
కాసింత మంచు వర్షం కురిస్తే
ఆనంద తాండవం చేయాలని వుంది
అంతే ఇది చాలు ఈ క్షణం..!

– డా. కటుకోఝ్వల రమేష్‌
సెల్‌:9949083327

Spread the love