– పెద్ద ధన్వాడలో రైతుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభం
నవతెలంగాణ- జోగులాంబ గద్వాల
జీఆర్‌ఎఫ్ ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలంటూ జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో రైతులు గురువారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. వారికి వివిధ గ్రామాల ప్రజలు, రైతులు తరలివచ్చి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. జీఆర్‌ఎఫ్ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాటంలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. విషపూరితమైన జీఆర్‌ఎఫ్ ఇథనాల్ ఫ్యాక్టరీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు భూములను బలవంతంగా తీసుకోవడానికి ప్రభుత్వం రైతులను భయభ్రాంతుల గురిచేస్తూ.. అక్రమ కేసులు నమోదు చేస్తోందని చెప్పారు. ప్రజా ఉద్యమాలను అణచివేయాలని అధికారి యంత్రాంగం ద్వారా ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ కంపెనీల నిర్మాణానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ.. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులపై అక్రమ కేసులను నమోదు చేయడం దుర్మార్గమన్నారు. రైతులపై ప్రభుత్వం కక్షపూరితమైన విధానాలు అవలంబిస్తే జిల్లా వ్యాప్తంగా ప్రజా ఉద్యమం తీవ్రం చేస్తామని, సామాజిక, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దుర్మార్గ విధానాలపై ప్రచారం చేస్తామని అన్నారు. ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలను కలుపుకుని పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విషపూరితమైన కార్పొరేట్ కంపెనీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం చేస్తున్న కుట్రలను వెంటనే విరమించుకుని, నడిగడ్డ రైతుల సాగు భూములను కాపాడాలని డిమాండ్ చేశారు.