గృహలక్ష్మి పథకం.. ఇంటి నిర్మాణానికి రూ.3లక్షల ఆర్థిక సాయం

నవతెలంగాణ – హైదరాబాద్‌: సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షల ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు రహదారులు, భవనాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వంద శాతం రాయితీతో ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. నియోజకవర్గానికి 3వేల చొప్పున లబ్ధిదారులకు సాయం అందిస్తారు. స్టేట్‌ రిజర్వు కోటాలో 43వేలు, మొత్తంగా 4లక్షల మందికి గృహలక్ష్మి పథకం కింద లబ్ధి చేకూరనుంది. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో, జీహెచ్‌ఎంసీలో కమిషనర్‌ ఆధ్వర్యంలో గృహలక్ష్మి అమలు కానుంది. వారే నోడల్‌ అధికారులుగా వ్యవహరిస్తారు. మహిళల పేరుమీదే గృహలక్ష్మి ఆర్థికసాయం అందిస్తారు. ఇందుకోసం లబ్ధిదారు మహిళ పేరిట ప్రత్యేక బ్యాంకు ఖాతా ఉంటుంది. జన్‌ధన్‌ ఖాతాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందుకోసం వినియోగించరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు గదులతో కూడిన ఆర్‌సీసీ ఇళ్ల నిర్మాణం కోసం ఆర్థిక సాయం ఇవ్వనున్న ప్రభుత్వం .. ఇంటి బేస్‌ మెంట్‌ లెవెల్‌, రూఫ్‌ లెవెల్‌, స్లాబు ఇలా మూడు దశల్లో సాయం అందిస్తారు. ఆహార భద్రత కార్డు ఉండి, సొంత స్థలం ఉన్న వారు అర్హులన్న ప్రభుత్వం.. ఇప్పటికే ఆర్‌సీసీ ఇళ్లు ఉన్న వారికి, 59 ఉత్తర్వు కింద లబ్ధి పొందిన వారికి అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఎస్సీలకు 20శాతం, ఎస్టీలకు 10శాతం, బీసీ.. మైనార్టీలకు 50శాతానికి తగ్గకుండా లబ్ధిదారులను ఎంపిక చేయాలని తెలిపింది. గృహలక్ష్మి కోసం అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం వాటిని పరిశీలించి కలెక్టర్‌ అర్హులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అబ్ధిదారుకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో దశలవారీగా గృహలక్ష్మి వర్తింపజేస్తారు. ఆర్థిక సాయం అందించగా మిగిలిన వారిని వెయిటింగ్‌ లిస్ట్‌లో పెట్టి భవిష్యత్‌లో ఆర్థిక సాయం అందిస్తారు. అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా జిల్లా కలెక్టర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమోదంతో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు. గృహలక్ష్మి పథకం అమలు కోసం ప్రత్యేక పోర్టల్‌, మొబైల్‌ అప్లికేషన్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది.

Spread the love